ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం సహించం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి మొత్తం 88 దరఖాస్తులను స్వీకరించారు.వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ,వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు.అనంతరం శాఖల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై సమీక్ష నిర్వహించి,వాటిని వచ్చే సోమవారం లోపే పూర్తిచేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారని, వారి ఆశలను నిలబెట్టడం అధికారుల బాధ్యత అని తెలిపారు.దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి అధికారి తన విధులను బాధ్యతగా నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడంలో ప్రజావాణి కార్యక్రమం ముఖ్య పాత్ర పోషిస్తోందని, దీనిని సమర్థంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.