మక్కలు,వరి కొనుగోలులో జాప్యం
వరంగల్ జిల్లా:వర్ధన్నపేటమండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్లో మక్కలు,వరి ధాన్యం కొనుగోలు జరగకపోవడం కాంటా అయిన మక్కలు ట్రాన్స్పోర్ట్ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మల్లాడి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్లో రైతులతో మాట్లాడిన అనంతరం కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవపురం లక్ష్మీ నరసయ్య,జిల్లా ఇన్చార్జి కొండపల్లి శ్రీధర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు,కొండేటి శ్రీధర్ తదితరులు జాతీయ రహదారి 563పై ధర్నాకు దిగారు.దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.నేతల ఆరోపణలు..
రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలులో విఫలమైంది.ధాన్యంసేకరణలో మొద్దు నిద్ర వహిస్తోంది.కేంద్రం గోనె సంచులు ఇస్తున్నా రైతులకు అందించకుండా కమిషన్ల కోసం పనిచేస్తోంది.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులను పట్టించుకోవడం లేదు అని బసవపురం లక్ష్మీ నరసయ్య ఆరోపించారు.పంట బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని,రైతు భరోసా,సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు.ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని వరంగల్ మార్కెట్ డీఎంకు ఫోన్లో విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.అనంతరం ధర్నా చేస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకట రమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జలగం రంజిత్ రావు,సిద్ధం నరేష్,మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు గార్లపాటి మంజులరెడ్డి,వర్ధన్నపేట కన్వీనర్ ముత్తిరెడ్డి కేశవరెడ్డి,మండల అధ్యక్షుడు అడప రాజు, సర్పంచులు,బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.