మోడీ విధానాలకు వ్యతిరేకంగా వ్యకాస పోరాటాలకు పిలుపు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. సత్తుపల్లిలోని రావి వీరవెంకయ్య భవన్లో తన్నీరు కృష్ణార్జునరావు అధ్యక్షతన సంఘం డివిజన్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విదేశాంగ విధానంలో స్వతంత్రతను కోల్పోయి అమెరికా, ఇజ్రాయిల్ విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు.యుద్ధ వాతావరణం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలపై భారమవుతుందని, యుద్ధాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. కఠిన నిబంధనలు, సాంకేతిక పద్ధతులతో కార్మికులకు ఉపాధి అవకాశాలు తగ్గిస్తున్నారని విమర్శించారు. బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయకుండా గ్రామీణ కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఉపాధి హామీ కింద సంవత్సరానికి 200 రోజులు పని కల్పించడంతో పాటు రోజుకు రూ.600 కూలి చెల్లించాలని డిమాండ్ చేశారు.జిల్లా అధ్యక్షుడు మెరుగు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. వ్యవసాయ కార్మికులకు ఆర్థిక భరోసా, గృహాలు, మహిళలకు ఆర్థిక సహాయం వంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.రాజ్యాంగ పరిరక్షణ కోసం కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఉపాధి సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 20, 21 తేదీల్లో మండల కార్యాలయాల వద్ద, మే 15న కలెక్టరేట్ల ముందు జరిగే ధర్నాలను విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో: శీలం సత్యనారాయణరెడ్డి, జాజిరి శ్రీనివాసరావు, కువ్వారపు లక్ష్మణరావు, గాయం తిరుపతిరావు, చిమట విశ్వనాథం, పిల్లి నాగమణి, బండి వేలాద్రి, లక్ష్మీనారాయణ, రాంబాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.