


ఈ69 న్యూస్ వర్ధన్నపేట మే31
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం లేబర్తి గ్రామం నుండి జగ్నా తండా వరకు ఆకేరు వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తికాకపోవడంతో స్థానిక ప్రజలు, రైతులు, గౌడ్ లు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ఈ సమస్యను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు విమర్శించారు.బ్రిడ్జి పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని పేర్కొన్నారు.గ్రామస్తుల వివరాల ప్రకారం, ఈ బ్రిడ్జి నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయని, అప్పట్లో పనులు ప్రారంభమై కొంత మేరకు పురోగతి సాధించాయని తెలిపారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత మిగిలిన పనులు పూర్తి చేయడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు.వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు తమ పంటలను తరలించడంలో, విద్యార్థులు పాఠశాలలు మరియు కళాశాలలకు వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ప్రజల చిరకాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.వర్షాకాలానికి ముందే బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.