విద్యార్థులను ఇబ్బంది పెడితే ఉపేక్షించం:ఎమ్మెల్యే గండ్ర
విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హెచ్చరించారు.శుక్రవారం రేగొండ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రైవేటు భవనంలో కొనసాగుతుండటం,మరుగుదొడ్ల సమస్య వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారనే సమాచారంతో వారు నేరుగా పాఠశాలకు చేరుకుని క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భవన యజమానిని పిలిపించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థుల సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తూ, వెంటనే మరుగుదొడ్ల మరమ్మతులు చేపట్టాలని, కొత్త వాటి నిర్మాణం, స్నానాల కోసం నీటి నల్లాలు,డ్రైనేజీ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకే మెస్, కాస్మోటిక్ ఛార్జీలను కూడా పెంచినట్లు తెలిపారు. అలాగే భూపాలపల్లి నియోజకవర్గంలోని గాంధీనగర్ వద్ద సమీకృత (ఇంటిగ్రేటెడ్) పాఠశాల నిర్మాణం వేగంగా కొనసాగుతోందని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందిస్తున్నామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని అన్నారు. విద్యార్థులు తమకు ఉన్న సమస్యలను నిర్భయంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకొని బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్ కలిసి విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల కిట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఈడబ్ల్యూఐడీసీ ఏఈ జీవన్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, సర్పంచ్ మౌనిక, ప్రధానోపాధ్యాయురాలు అపర్ణ తదితరులు పాల్గొన్నారు.