ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్య శరణ్యం అంటున్న రైతు కుటుంబంప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్య శరణ్యం అంటున్న రైతు కుటుంబం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ11 May, 2026E69NEWS

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కళ్లముందే బూడిదైన మొక్కజొన్న పంట

ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్య శరణ్యం అంటున్న రైతు కుటుంబం

ఏం చేయాలో అర్థం కాక కన్నీరుమున్నీరవుతున్న రైతన్న

ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్య శరణ్యం అంటున్న రైతు కుటుంబం

తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండ
ఆరుగాలం కష్టపడి,అప్పులు తెచ్చి పండించిన పంట,సరిగ్గా ఇంటికి చేరే సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ రూపంలో వచ్చిన ప్రమాదం ఆ రైతు కుటుంబాన్ని చీకట్లోకి నెట్టింది.జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నర్సింగాపూర్ (రేపాక) గ్రామంలో చోటుచేసుకున్న ఈ అగ్నిప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రైతు కంజుల రమేష్ తనకున్న రెండు ఎకరాల భూమిలో సుమారు రెండు లక్షల రూపాయల వరకు అప్పు తెచ్చి పెట్టుబడిగా పెట్టి మొక్కజొన్న పంటను సాగు చేశారు.వాతావరణం అనుకూలించి పంట బాగా పండటంతో, పంటను కోసి అమ్మితే అప్పులన్నీ తీరిపోతాయని ఆశపడ్డారు.కోత సమయానికి ట్రాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో,మొక్కజొన్న కంకులను కూలీల సహాయంతో తెంపించి చేనులోనే కుప్పలుగా పోసి ఉంచారు.అయితే సోమవారం పొలం మీదుగా వెళ్తున్న విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి పంట కుప్పలకు అంటుకున్నాయి.సమీపంలోని రైతులు మంటలను గమనించి రమేష్‌కు సమాచారం అందించే లోపే,ఎండ తీవ్రతకు మంటలు వేగంగా వ్యాపించి రెండు ఎకరాల్లోని పంటను పూర్తిగా దహించివేసాయి.ఈ ప్రమాదంలో సుమారు 100 క్వింటాళ్లకు పైగా మొక్కజొన్న కంకులతో పాటు,పంటకు అమర్చిన ఖరీదైన డ్రిప్పు పైపులు,విద్యుత్ మోటారు కూడా కాలి బూడిదయ్యాయి.సమాచారం అందుకుని పొలం వద్దకు పరుగున వచ్చిన రమేష్, కళ్లముందే బూడిద కుప్పగా మారిన తన పంటను చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. “రెండు లక్షల అప్పు తెచ్చి కష్టపడితే,ఇప్పుడు ఆ అప్పులు ఎలా తీర్చాలి? ప్రభుత్వం నన్ను ఆదుకోకపోతే ఉరేసుకోవడం తప్ప మరో మార్గం లేదు” అంటూ ఆయన విలపిస్తున్న తీరు అక్కడి వారిని కలిచివేసింది. నిరుపేద రైతు కంజుల రమేష్‌కు జరిగిన భారీ నష్టాన్ని చూసి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు వెంటనే ఘటనా స్థలాన్ని సందర్శించి పంట నష్టాన్ని అంచనా వేయాలని,మానవీయ కోణంలో స్పందించి రైతుకు ప్రభుత్వం తరఫున తక్షణ ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని,లైన్ల నిర్వహణ సరిగ్గా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *