అగ్రకుల ఆధిపత్య దుండగులపైన ఎస్సీ, ఎస్టీ కేసుఅగ్రకుల ఆధిపత్య దుండగులపైన ఎస్సీ, ఎస్టీ కేసు

కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ డిమాండ్

నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో కుల దురహంకారంతో ఎస్సీ వర్గానికి చెందిన చిన్నారి ప్రాణాలు తీసిన అగ్రకుల ఆధిపత్య దుండగులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ బాధితులు దళిత కుటుంబానికి చెందినవారని తెలిసినా, కనీస భద్రతా చర్యలు తీసుకోకుండా అధికారుల కనుసన్నల్లోనే అగ్రకులానికి చెందిన దుండగులు అత్యంత దారుణంగా తల్లి కూతుళ్లపై దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, దళితుల ప్రాణాలపట్ల పాలక వర్గాల నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతుందని, కులవివక్ష ఇంకా నేటికీ కొనసాగుతుందనే భయంకర వాస్తవానికి ఇది నిదర్శనమని వారు ఆక్షేపించారు. ఈ ఘటన జరిగి రోజులు గడుస్తున్నా, నేటికీ ఒక్క దోషిని కూడా అరెస్ట్ చేయకపోగా, దాడికి గురైన దళితులపైనే పోలీసులు కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు.
బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, ఇది రాజ్యాంగ ద్రోహం తప్ప మరొకటి కాదని వారు విమర్శించారు. ఈ ఘటనకు పాల్పడిన దోషులపైన వెంటనే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయలు పరిహారం వెంటనే చెల్లించాలని, సంబంధిత పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఈ ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితుల ప్రాణాలు చవకగా మారిన ఈ వ్యవస్థపై మౌనంగా ఉండకుండా ప్రజాస్వామిక వాదులు, మేధావులు స్పందించాలని, న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే, కెవిపిఎస్ ఆధ్వర్యంలో బాధితుల తరపున పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *