ఆశా కార్యకర్తల సేవలు అమూల్యం–జిల్లా కలెక్టర్
భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలకు “ఆశా డే”శుభాకాంక్షలు తెలియజేస్తూ,ప్రజారోగ్య పరిరక్షణలో వారి సేవలు అమూల్యమని కొనియాడారు.కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11వ తేదీ వరకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వివిధ ఆరోగ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు.ఆశా కార్యకర్తలు గ్రామ,మండల స్థాయిలో గర్భిణీలకు సమయానికి పరీక్షలు నిర్వహిస్తూ సుఖ ప్రసవాలు జరిగేలా చూడాలని,మాతా-శిశు మరణాలు నివారించేందుకు కృషి చేయాలని ఆదేశించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు సుమారు 70 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారని వైద్యులు వివరించగా,ఓపీ సేవలను మరింత విస్తరించాలని సూచించారు.ఈ కేంద్ర పరిధిలో పోషణ లోపంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్,అలాంటి కేసులు లేవని తెలియడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ గ్రామం,మండలాల వారీగా పోషణ లోపం ఉన్న చిన్నారుల జాబితా సిద్ధం చేయాలని సూచించారు.బాల్యం నుంచే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం అవసరమని,ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ప్రయోగశాలను పరిశీలించి, అందుబాటులో ఉన్న సదుపాయాలు, నిర్వహిస్తున్న పరీక్షలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ స్వరూప రాణి,ఎంపీడీవో అనిత,వైద్యులు డాక్టర్ నాగరాణి,హారిక,సర్పంచ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.