జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఎలాంటి అక్రమాలకు తావులేకుండా,అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ,పోలీస్,మున్సిపల్,విద్యా,వైద్య తదితర శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 13వ తేదీ నుండి 21వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయని తెలిపారు.మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే,అంటే ఉదయం బ్యాచ్ వారు 8:30 గంటలకు,మధ్యాహ్నం బ్యాచ్ వారు 2 గంటలకు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు,స్మార్ట్ వాచ్లు,ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యార్థులతో పాటు సిబ్బందికి కూడా అనుమతించబోమని,నిశిత తనిఖీల తర్వాతే లోపలికి పంపిస్తారని స్పష్టం చేశారు.విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని, ప్రతి కేంద్రంలో తాగునీరు,ప్రథమ చికిత్స మందులతో కూడిన వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలు చేయాలని,జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.జిల్లాలోని భూపాలపల్లి,కాటారం,మహాదేవపూర్,చిట్యాల మండలాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని,మొదటి సంవత్సరం 913 మంది,రెండో సంవత్సరం 306 మంది విద్యార్థులు హాజరవుతున్నారని కలెక్టర్ వెల్లడించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్,విజయలక్ష్మి,ఏఎస్పీ నరేష్ కుమార్,డీఆర్వో వసంత కుమారి,ఇంటర్మీడియట్ అధికారి వెంకన్న,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.