గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి
సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదు
– రాపర్తి రాజు
తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ & వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ & వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపర్తి రాజు తీవ్రంగా విమర్శించారు.పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 52 వేల మంది గ్రామపంచాయతీ కార్మికులు గ్రామాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం, అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ వారి సేవలకు తగిన గుర్తింపు, గౌరవం ప్రభుత్వం ఇవ్వడం లేదని అన్నారు.గ్రామాల అభివృద్ధి గురించి గొప్పలు చెప్పే ప్రభుత్వం, గ్రామపంచాయతీ కార్మికుల వేతనాల పెంపుపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న వేతనాల మాదిరిగానే గ్రామపంచాయతీ కార్మికులకు కూడా సమాన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విధానం వల్ల కార్మికులతో నైపుణ్యం లేని ప్రమాదకర పనులు చేయిస్తున్న కారణంగా గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 మంది కార్మికులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఇప్పటివరకు ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం మల్టీ పర్పస్ విధానంపై ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కొని అధికారాన్ని కోల్పోయిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పును కొనసాగిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేటగిరీల వారీగా యథావిధిగా విధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.2026 జనాభా ప్రాతిపదికన గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న అదనపు కార్మికులను గుర్తించి, వారి పేర్లను ఆన్లైన్లో నమోదు చేసి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. అలాగే పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, యూనిఫాంలు, సబ్బులు, నూనెలు, భద్రతా పరికరాలు, ఆరోగ్య రక్షణ సామగ్రి అందించాలని డిమాండ్ చేశారు.గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని, పెండింగ్లో ఉన్న బకాయి వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు.గ్రామస్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సమ్మె బాట పట్టడం అనివార్యమవుతుందని రాపర్తి రాజు హెచ్చరించారు.