ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీ కొరతపై రైతుల ఆందోళనసీపీఐ హెచ్చరిక

సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం
ఈ69న్యూస్ జఫర్ఘడ్, మే 5
జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత తీవ్ర సమస్యగా మారడంతో రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. లారీలు అందుబాటులో లేకపోవడం, అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ మండల కార్యదర్శి జువారి రమేష్ ఆరోపించారు. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా రహదారులు దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు.గురువారం కుర్చపల్లి గ్రామంలోని IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీపీఐ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.కేంద్రం ప్రారంభించి 20 రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు సక్రమంగా జరగడం లేదని, జియోట్యాగింగ్ మరియు మిల్లులకు ట్యాగింగ్ లేకపోవడం వల్ల ధాన్యం తరలింపులో ఆలస్యం జరుగుతోందని తెలిపారు.లారీ కాంట్రాక్టర్లతో సివిల్ సప్లై అధికారులు కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గన్నీ సంచుల కొరతపై ఎపిఎంను గెరావ్ చేసి పంపిణీ చేయించాల్సి వచ్చిందని చెప్పారు. నెల రోజులుగా ధాన్యం కేంద్రాలకు తీసుకువచ్చినా లారీలు రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు.వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ధాన్యం నిల్వలు తడిసిపోతే రైతులు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి గత సంవత్సరం మాదిరిగానే కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని, లారీలు లేకపోతే ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలించేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షుడు ఎం.డి. యాకుబ్ పాషా, సీపీఐ నాయకులు వడ్లకొండ సుధాకర్, వేల్పుల పెద్దరాములు, మంద బుచ్చయ్య, అన్నెపు అజయ్, చిలివేరు ఎల్లయ్య, అన్నెపు విష్ణు తదితరులు పాల్గొన్నారు.