హనుమకొండలో రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా–పాల్గొన్న ఎంపీ డాక్టర్ కడియం కావ్య




ఈ69న్యూస్ హన్మకొండ మే05
హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, దనసరి అనసూయ సీతక్కలతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, సాంకేతిక స్టాళ్లను సందర్శించిన వారు రైతులతో మమేకమై, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ పథకాలపై అధికారులు అందిస్తున్న వివరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న మెగా రైతు మేళా రైతు అభివృద్ధికి దోహదపడే కీలక కార్యక్రమమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.రైతు రుణమాఫీ అమలు, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాల ద్వారా రైతులకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని తెలిపారు.అలాగే 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు అందజేస్తూ రైతులకు సహకరిస్తున్నామని చెప్పారు.రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా విభిన్న పంటలను సాగు చేసి ఆదాయం పెంచుకోవాలని సూచించారు.వ్యవసాయ రంగంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ సన్న బియ్యం ఉత్పత్తికి ప్రోత్సాహం అందిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని రైతులు పూర్తిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ రెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్, హార్టికల్చర్ సెక్రటరీ యాస్మిన్ బాషా, వరంగల్-హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.