ముగ్గురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్2.310 కిలోల గంజాయి స్వాధీనం–కొత్తపల్లిగోరి పోలీసుల మెరుపు దాడి

ఈ69 న్యూస్, భూపాలపల్లి (కొత్తపల్లిగోరి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మెరుపు దాడిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు రూ.1 లక్ష విలువైన 2.310 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు గంజాయి నిర్మూలన చర్యల్లో భాగంగా, ఎస్సై సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి తన బృందంతో జెంషెడ్ బేగ్పేట బ్రిడ్జ్ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్పై వచ్చిన ముగ్గురు అనుమానితులు పోలీసులను గమనించి పారిపోవడానికి యత్నించగా, వెంటాడి పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న సంచులను సోదా చేయగా గంజాయి బయటపడింది.అరెస్టయిన వారిలో బైరగాని గణేష్ (16), పాయం వర్షిత్ (17), బీస ప్రవీణ్ (23) ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరు ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి సరిహద్దుల నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయించాలనుకున్నట్లు వెల్లడించారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను గణపురం సర్కిల్ సీఐ కరుణాకర్ రావు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత భవిష్యత్తును నాశనం చేసే మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ‘ఈగల్ టీమ్స్’ ప్రత్యేకంగా పనిచేస్తున్నాయని, గంజాయి సాగు మరియు రవాణాపై కఠిన నిఘా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఎస్సై సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి సహా పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.