పంట వ్యర్థాల కాల్చివేతతో నేల సారానికి ముప్పు
పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నేల ఆరోగ్యం, పర్యావరణంపై తీవ్ర ప్రభావాలు పడతాయని మండల వ్యవసాయాధికారి పచ్చల రామ్మోహన్ రావు రైతులకు సూచించారు. ఖమ్మంజిల్లా వేంసూరు మండల పరిధిలోని అమ్మపాలెం,వేంసూరు గ్రామాలలో గల రైతువేదిక సమావేశ మందిరంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఈ మేరకు రైతులకు వివరించారు.
సర్పంచ్ మహమ్మద్ ఫక్రుద్దీన్ మాట్లాడుతూ పంట అవశేషాలను కాల్చడం వల్ల భూమి సారవంతత తగ్గిపోవడంతో పాటు వాయు కాలుష్యం పెరుగుతుందని తెలిపారు. పంట వ్యర్థాలను కాల్చిన రైతులపై ప్రభుత్వం జరిమానాలు కూడా విధించే అవకాశముందని హెచ్చరించారు.
ఏవో రామ్మోహన్ మాట్లాడుతూ వరి, గోధుమ, మొక్కజొన్న వంటి పంటల కోత అనంతరం పొలాల్లో మిగిలిపోయే గడ్డి, అవశేషాలను తగలబెట్టడం సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ, ఇది నేల ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపారు. కాల్చివేత వల్ల నేలలోని సేంద్రియ కార్బన్ నశించి నేల సారవంతత తగ్గిపోతుందని చెప్పారు.
అలాగే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, వానపాములు వంటి సూక్ష్మజీవులు అధిక ఉష్ణోగ్రతల కారణంగా నశిస్తాయని వివరించారు. నత్రజని, గంధకం వంటి ముఖ్య పోషకాలు వాతావరణంలో కలిసిపోవడంతో రైతులు రసాయన ఎరువులపై అధికంగా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.
పంట అవశేషాల కాల్చివేత వల్ల నేల గట్టిపడటం, తేమ నిల్వ తగ్గిపోవడం, నీటి అవసరం పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు విడుదలై వాయు కాలుష్యానికి దారితీస్తాయని చెప్పారు.
పంట వ్యర్థాలను కాల్చకుండా మల్చింగ్, కంపోస్టింగ్, మట్టిలో కలపడం, హ్యాపీ సీడర్ వినియోగం, బయో డీకంపోజర్ స్ప్రేలు వంటి సుస్థిర పద్ధతులను రైతులు అనుసరించాలని సూచించారు. దీని ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడి, పంట ఉత్పాదకత పెరుగుతుందని తెలిపారు.