




సత్తుపల్లి, ఆర్సి, ఏప్రిల్ 21 (E69NEWS):
సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం సెక్టార్లో ఉన్న పలు అంగన్వాడీ కేంద్రాలను స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి (డీడబ్ల్యూఓ) విజేత మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు.ఈ సందర్భంగా ఆమె అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి, చిన్నారులతో కలిసి కింద కూర్చొని ముచ్చటించారు. గుడ్లు ఎప్పటికప్పుడు అందిస్తున్నారా, పిల్లలకు ఆటలు నిర్వహిస్తున్నారా అని అడగగా, చిన్నారులు ప్రతి రోజు అందిస్తున్నారని, ఆటలు కూడా ఆడిస్తున్నారని సంతోషంగా సమాధానం ఇవ్వడంతో విజేత ఆనందం వ్యక్తం చేశారు.కేంద్రాల్లోని చిన్నారుల బరువును తూకం వేసి పరిశీలించిన ఆమె, లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సూపర్వైజర్లు లేదా సీడీపీఓలకు ఎలాంటి మామూళ్లు ఇస్తున్నారా అని ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని టీచర్లు, హెల్పర్లు ముక్తకంఠంతో తెలిపారు.పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన విజేత, జిల్లాలో ఎక్కడైనా అంగన్వాడీ సిబ్బంది విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎటువంటి లోపాలు కనిపించలేదని, కేంద్రాల పనితీరుపై తాను సంతృప్తిగా ఉన్నానని పేర్కొన్నారు.