
ఈ69న్యూస్, మహబూబాబాద్ జిల్లా
కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ, ఉపాధ్యాయుల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించే ప్రయత్నాలు చేయడం తగదని ఉపాధ్యాయ సంఘాల జేఏసి నాయకులు కీసర రమేష్ రెడ్డి, గండి కరుణాకర్, మాలోత్ భరత్, తల్లాడ శ్యామ్ హెచ్చరించారు. మరిపెడ మండల విద్యావనరుల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారిణి గాదె అనితా దేవికి ఉపాధ్యాయులను కించపరిచే విధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జేఏసి తరఫున వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హౌస్‌హోల్డ్ సర్వేలో సెకండరీ గ్రేడ్ టీచర్లను సూపర్వైజర్లుగా నియమించడం సరికాదని చెప్పడం తగదని అన్నారు. స్కూల్ అసిస్టెంట్ల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పడం సరైంది కాదని స్పష్టం చేశారు. 2024లో నూతనంగా నియమితులైన ఎస్జీటీ ఉపాధ్యాయులను ప్రొబేషనరీ పేరుతో పక్కనపెట్టి, వారికి రావలసిన విధులను ఇవ్వకపోవడం వల్ల వారి మనోభావాలు దెబ్బతినలేదా అని ప్రశ్నించారు.
ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నప్పుడు, అదే సెకండరీ గ్రేడ్ టీచర్లను బోధన కోసం వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో నియమించిన సందర్భాల్లో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడం గమనార్హమని అన్నారు. అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని, వారిని తక్కువగా చూడడం సరికాదని తెలిపారు.
ప్రభుత్వ విధుల నిర్వహణలో అన్ని స్థాయిల ఉపాధ్యాయులు సమాన భాగస్వాములనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని సూచించారు. జూన్ 2024కు ముందు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారూ ఎస్జీటీగా పనిచేసిన వారేనని గుర్తుంచుకోవాలని అన్నారు. ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 70-80 శాతం మంది ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలల నుండి పదోన్నతిపై వచ్చిన వారేనని పేర్కొన్నారు.
ఇటీవల సమర్పించిన వినతిపత్రంలోనే తప్పులు ఉండటం గమనించాల్సిన విషయమని, అలాంటి వారు విద్యార్థులకు ఎలా బోధన అందిస్తున్నారని ప్రశ్నించారు. ఇకనైనా ఉపాధ్యాయుల మధ్య వైషమ్యాలు సృష్టించకుండా అందరూ సమానమనే భావనతో ముందుకు రావాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గుగులోత్ శ్రీధర్, దోమల లింగన్న, యాదగిరి, వెంకటేశ్వరరావు, రామూర్తి, సందీప్, చంద్రశేఖర్, వెంకటయ్య, రమేష్, సృజన, లెనిన్, విజయ్ కుమార్, మధుబాబు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.