సహకార సంఘాలపై బీకేఎంయూ నేత వెంకట్రాములు డిమాండ్
నామినేటెడ్ కమిటీలు వద్దు- ఎన్నికలే ముద్దు
•సహకార సంఘాలపై బీకేఎంయూ నేత వెంకట్రాములు డిమాండ్
•సహకార సంఘాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చొద్దు: ప్రభుత్వానికి బీకేఎంయూ హెచ్చరిక
తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/మే 8
వరంగల్ జిల్లా:పర్వతగిరి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ కమిటీలు వేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకొని తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పిఎసిఎస్‌ల పాలకవర్గాలను రద్దు చేసిన ప్రభుత్వం నామినేటెడ్ కమిటీలు వేయడానికి రంగం సిద్ధం చేసినట్లు,అందుకోసం ఆర్డినెన్స్ తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని
“సహకార సంఘాల పాలకవర్గాల గడువు ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేయడం దుర్మార్గం.రైతుల ప్రయోజనాలను కాపాడడానికి,వారి సంక్షేమం కోసం పనిచేయడానికి ఏర్పడిన సహకార సంఘాలకు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపి సహకార వ్యవస్థను పటిష్టం చేయాలి. కానీ అధికార పార్టీ తమ అనుయాయులకు పదవులు కట్టబెట్టే ఆలోచన చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం”అని విమర్శించారు.ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను అమలు జరపకుండా రైతుల సమస్యలను పరిష్కరించకపోవడం వల్ల వారు అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే రైతుల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని భావించే ఎన్నికలు జరపకుండా అనుయాయులకు పదవులు కట్టబెట్టేందుకు ప్రయత్నించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే, రైతాంగాన్ని అవమానపరచడమే”అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణిని విడనాడి సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టాలని,లేనిచో రైతుల, ప్రజాస్వామ్యవాదుల విశ్వాసాన్ని కోల్పోవలసి వస్తుందని వెంకట్రాములు ప్రభుత్వాన్ని హెచ్చరించారు