- ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం
- ఓటర్ల జాబితాలో అక్రమాలకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి – మంత్రి సీతక్క డిమాండ్
తెలుగు గళం ములుగు, సెప్టెంబర్ 28:
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో సోమవారం ములుగు జిల్లా కేంద్రంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ఈ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనల్లో భాగంగానే తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అవకతవకలు, ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం నిలబెట్టేందుకు సమగ్ర వివరణ ఇవ్వాలని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, పంచాయతీరాజ్ రాష్ట్ర డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, గుమ్మడి సోమయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్, డీసీసీ ఉపాధ్యక్షుడు పల్లె జైపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, జిల్లా సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, యువజన మరియు మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
