- ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి పట్టభద్రుడు ముందుకు రావాలి
తెలుగు గళం ములుగు, సెప్టెంబర్ 28:
ఖమ్మం–నల్లగొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హత కలిగిన ములుగు నియోజకవర్గంలోని ప్రతి పట్టభద్రుడు తమ ఓటును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పిలుపునిచ్చారు. పట్టభద్రుల సమస్యలు, ఉద్యోగాలు, విద్య, ఉపాధి తదితర అంశాలను శాసన మండలిలో సమర్థవంతంగా ప్రస్తావించేందుకు ప్రతి పట్టభద్రుడి భాగస్వామ్యం అవసరమని తెలిపారు. అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదు ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పూర్తి చేసుకోవాలని, తమ పరిసరాల్లోని ఇతర పట్టభద్రులకు కూడా సమాచారం అందించి వారిని నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. ఓటరు నమోదుకు అవసరమైన ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, డిగ్రీ ధ్రువపత్రం, పాస్పోర్ట్ సైజు ఫొటో, మొబైల్ నంబర్ వంటి వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.“పట్టభద్రుల ఓటు నమోదు మన హక్కు.. మన బాధ్యత” అని పేర్కొంటూ, అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలని కాకులమర్రి లక్ష్మణ్ బాబు కోరారు.
