కలెక్టర్లతో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
ఓటర్లకు ఇబ్బందులు లేకుండా ఎస్ఐఆర్ ప్రక్రియ
ఇళ్ల వద్దకే వెళ్లి నోటీసులు.. పత్రాల స్వీకరణ చేయాలి
ఓటర్లను కార్యాలయాలకు పిలవొద్దు: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి
ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా ఎస్ఐఆర్–2026 ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓటర్లను పదేపదే ప్రభుత్వ కార్యాలయాలకు పిలిపించకుండా, క్షేత్రస్థాయిలోనే అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్–2026, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సీఈఓ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ములుగు జిల్లా నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో సమావేశ మందిరం నుంచి సమావేశంలో పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు జారీ చేయాల్సిన నోటీసులను వారి ఇళ్ల వద్దే అందజేయాలని సీఈఓ సూచించారు. అవసరమైన పత్రాలను కూడా ఓటర్లను కార్యాలయాలకు రప్పించకుండా బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) వారి ఇళ్ల వద్దే స్వీకరించాలని ఆదేశించారు. సాధారణంగా ఓటర్లను విచారణ కోసం కార్యాలయాలకు పిలవరాదని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో విచారణ నిర్వహించాల్సి వస్తే ఆన్లైన్ విధానాన్ని వినియోగించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొత్త ఓటరు నమోదుకు ఫారం-6 సమర్పించే సమయంలో డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలని సీఈఓ సి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ అమలులో ఉన్నందున కొత్త ఓటర్ల నమోదు సమయంలో నిబంధనల ప్రకారం డిక్లరేషన్ తీసుకోవాలని సూచించారు. అలాగే ఈఆర్ఓ కార్యాలయాల నోటీసు బోర్డులపై ఫారం-6, ఫారం-7కు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులు, పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. పెండింగ్ నోటీసులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ఫారం-6, పెండింగ్ నోటీసులు, ఫారం-7, ఫారం-8కు సంబంధించిన దరఖాస్తుల స్థితిగతులు, పెండింగ్ మరియు పరిష్కార వివరాలను అన్ని స్థాయిల్లోని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎప్పటికప్పుడు అందించాలని సీఈఓ ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో అధికారులు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.ఎస్ఐఆర్–2026 ప్రక్రియలో ప్రతి దశను బాధ్యతాయుతంగా పూర్తి చేస్తూ, అర్హులైన ప్రతి ఓటరుకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఈఓ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీవో కృష్ణవేణి, ఎన్నికల విభాగం సిబ్బంది సలీం, నితీష్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు