సేంద్రీయ సాగుతోనే ఆరోగ్యకర సమాజంసేంద్రీయ సాగుతోనే ఆరోగ్యకర సమాజం

జాతీయ సమగ్ర ప్రకృతి వ్యవసాయ పథకం ఆధ్వర్యంలో కృషి సఖీలకు 5 రోజుల శిక్షణ ప్రారంభం

రసాయన ఎరువులు,పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలని పిలుపు

వ్యవసాయ రంగంలో విచ్చలవిడిగా రసాయనాల వాడకాన్ని తగ్గించి,సేంద్రీయ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యవసాయ అధికారి జె.బాపు పేర్కొన్నారు.జాతీయ సమగ్ర ప్రకృతి వ్యవసాయ పథకం ఆధ్వర్యంలో జిల్లాలోని కృషి సఖీలు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లకు ఉద్దేశించిన ఐదు రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రస్తుత రోజుల్లో పంటలపై విచక్షణారహితంగా చేస్తున్న రసాయనాల పిచికారీ వల్ల పర్యావరణంతో పాటు భూసారం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.సేంద్రీయ వ్యవసాయం వల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని,ఇందుకు సంబంధించిన పలు లాభసాటి మెళకువలను కృషి సఖీలకు సవివరంగా వివరించారు.శిక్షణ పొందిన కృషి సఖీలు గ్రామాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి,రైతులతో నేరుగా మమేకమై సేంద్రీయ వ్యవసాయ ప్రాముఖ్యతను తెలియజేయాలని సూచించారు.రైతులు రసాయనిక పురుగు మందుల వాడకం తగ్గించి ప్రకృతి సాగు వైపు మళ్లేలా ప్రోత్సహించాలని,జిల్లాలో సేంద్రీయ వ్యవసాయ విస్తరణకు కృషి సఖీలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.అనంతరం సార్ప్ ఎన్జీవో జిల్లా నోడల్ ఆఫీసర్ ఎం.మణికుమార్ మాట్లాడుతూ,వ్యవసాయంలో క్రిమిసంహారకాలు,రసాయనాల వాడకం వలన ప్రజలు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని తెలిపారు.ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కేవలం విషరహితమైన మంచి ఆహారం ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతోనే ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుండి విచ్చేసిన కృషి సఖీలు,క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు,సంబంధిత వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *