పట్టభద్రుల ఓటరు నమోదుకు మండల పార్టీ అధ్యక్షులు దేవులపల్లి విజయ్ కుమార్ పిలుపు
పట్టభద్రుల హక్కుల పరిరక్షణకు ఓటు హక్కు కీలకం
తెలుగు గళం ఏటూరునాగారం అక్టోబర్ 01:
ఖమ్మం–నల్లగొండ–వరంగల్ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఓటరు నమోదుకు అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తమ ఓటును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఏటూరునాగారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దేవులపల్లి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పట్టభద్రుల సమస్యలు, హక్కులు, ఉద్యోగం, విద్య తదితర అంశాలను శాసన మండలిలో సమర్థవంతంగా వినిపించేందుకు ప్రతి పట్టభద్రుడి భాగస్వామ్యం అవసరమని తెలిపారు. అర్హత కలిగిన పట్టభద్రులు ఓటరు నమోదును నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు నమోదు కోసం ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, డిగ్రీ పట్టా ధ్రువపత్రం, పాస్పోర్ట్ సైజు ఫొటో, మొబైల్ నంబర్ వంటి అవసరమైన వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రతి పట్టభద్రుడు తన ఓటును నమోదు చేసుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు మరియు పరిసర ప్రాంతాల్లోని అర్హులైన పట్టభద్రులను కూడా ఓటరు నమోదుకు చైతన్యపరచాలని దేవులపల్లి విజయ్ కుమార్ కోరారు.“పట్టభద్రుల ఓటు కేవలం ఓటు కాదు.. మన హక్కుల కోసం మన గొంతుక. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఓటు నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలి” అని ఆయన పేర్కొన్నారు.
