. నిందితుడు సుమారు రూ.57 లక్షల వరకు డబ్బులు వివిధ బ్యాంకు ఖాతాలు. నిందితుడు సుమారు రూ.57 లక్షల వరకు డబ్బులు వివిధ బ్యాంకు ఖాతాలు

నిందితుడి అరెస్ట్

తెలుగు గళం న్యూస్ వరంగల్ సెప్టెంబర్ 29

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నకిలీ ఆఫర్ లెటర్లు, జాయినింగ్ లెటర్లు సృష్టించి భారీగా డబ్బులు వసూలు చేసిన కేసులో మార్క శివకుమార్ అనే నిందితుడిని పర్వతగిరి పోలీసులు వరంగల్ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రకారం.. నిందితుడు సుమారు రూ.57 లక్షల వరకు డబ్బులు వివిధ బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఖాతాలకు బదిలీ చేయించుకుని ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నట్లు విచారణలో వెల్లడించాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం తిమ్మంపేటకు చెందిన మార్క శివకుమార్‌ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివాడు. గతంలో పలు ప్రైవేట్ సంస్థల్లో మెడికల్ రిప్రజెంటేటివ్, బిజినెస్ డెవలప్‌మెంట్, సీనియర్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, కీ అకౌంటెంట్ వంటి ఉద్యోగాలు చేశాడు.ఉద్యోగాలు కోల్పోయిన అనంతరం ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడినట్లు పోలీసులు తెలిపారు.గతంలో తనతో కలిసి పనిచేసిన బోడ రవి ప్రస్తుతం యూకేలో ఉన్నట్లు తెలుసుకున్న శివకుమార్.. అతనికి విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ పరిచయం పెంచుకున్నాడు. తాను లీవరేజ్ ఎడ్యూ సంస్థలో పనిచేస్తున్నట్లు చెప్పి, లండన్‌లోని ర్యాక్‌స్పేస్ టెక్నాలజీలో ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఉద్యోగం ప్రాసెసింగ్ కోసం తొలుత రూ.30,000 చెల్లించాలని రవిని కోరగా, అతను ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపినట్లు పోలీసులు తెలిపారు.అనంతరం రవిని నమ్మించేందుకు నిందితుడు మూడు సిమ్ కార్డులు తీసుకుని, కునాల్ సింగ్ హెచ్‌ఆర్ మేనేజర్, రాఘవ్ మేనేజర్, ఆశిష్ సోలంకి ఫైనాన్స్ మేనేజర్ పేర్లతో తానే వాట్సాప్‌లో చాటింగ్ చేసినట్లు పోలీసుల ప్రకటనలో ఉంది. ఎలెవెన్‌ల్యాబ్స్ అప్లికేషన్ ద్వారా వాయిస్‌లను రూపొందించి హెచ్‌ఆర్ పేరుతో వాయిస్ మెసేజ్‌లు పంపినట్లు పేర్కొన్నారు.నకిలీ ఉద్యోగ ఆఫర్ లెటర్, జాయినింగ్ లెటర్‌లను సృష్టించేందుకు సెజ్డా వెబ్‌సైట్‌ను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.గోడాడీ ద్వారా నకిలీ ఈమెయిల్ ఐడీని సృష్టించి, ర్యాక్‌స్పేస్ టెక్నాలజీకి చెందిన అధికారిక ఈమెయిల్‌లా కనిపించే చిరునామా నుంచి రవికి ఆఫర్ లెటర్ పంపినట్లు విచారణలో వెల్లడైంది.24.06.2026న ఆఫర్ లెటర్, 01.07.2026న జాయినింగ్ లెటర్ పంపినట్లు పోలీసులు తెలిపారు.రవికి అనుమానం రాకుండా తన వ్యక్తిగత ఖాతాకు కాకుండా వివిధ బెట్టింగ్ యాప్ యూపీఐలు, ఇతర బ్యాంకు ఖాతాలకు డబ్బులు బదిలీ చేయించినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విధంగా సుమారు రూ.57 లక్షల వరకు డబ్బులు బదిలీ చేయించుకుని, వాటిని ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నట్లు విచారణలో వెల్లడైంది.రవి నుంచి మాత్రమే సుమారు రూ.26 లక్షల వరకు డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.నిందితుడిపై గతంలోనూ మోసం కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.జఫర్‌గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్న కేసులో, అలాగే టేకుమట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ యువతిని మోసం చేసిన కేసులో అతనిపై కేసులు నమోదై స్టేషన్ బెయిల్ పొందినట్లు తెలిపారు.తనను మోసం చేస్తున్న విషయం రవికి తెలిసి డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరిన నేపథ్యంలో, 11.09.2026న రవి గ్రామానికి వెళ్లిన శివకుమార్ రూ.50,000 తీసుకుని మిగిలిన డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం పోలీసులు నిందితుడిని వరంగల్ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు.నిందితుడి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన 2 సెల్‌ఫోన్లు, ఒక హెచ్‌పీ క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సెల్‌ఫోన్లలో ఉన్న వాట్సాప్ చాటింగ్‌లు, ఈమెయిల్ వివరాలు, బెట్టింగ్ యాప్ సమాచారం తదితరాలను పరిశీలించి స్క్రీన్‌షాట్‌లను పెన్‌డ్రైవ్‌లో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు.ఐబెటిన్ యాప్‌లో నిందితుడి ఖాతాను పరిశీలించగా 321 బెట్లకు సంబంధించిన వివరాలు, మొత్తం బెట్ల విలువ రూ.76,82,069.71గా, చెల్లింపులు రూ.71,54,228.31గా నమోదై ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.క్రైమ్ నంబర్ 205/2026 కింద బీఎన్‌ఎస్‌లోని 318(4), 319(2), 336(3), 340(2) సెక్షన్లు, 3(5)తో పాటు ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 66(డి) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *