1/70 చట్టం జోలికొస్తే సహించేది లేదు1/70 చట్టం జోలికొస్తే సహించేది లేదు
  • ఆదివాసీ హక్కుల పరిరక్షణకు అక్టోబర్‌ 5న ఛలో భద్రాద్రి కొత్తగూడెం
  • కలెక్టరేట్‌ మహాధర్నాను విజయవంతం చేయాలి
  • – ఆదివాసీ సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపు

ఆదివాసీల హక్కులు, భూములు, విద్య, ఉద్యోగాలు, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యాన్ని పరిరక్షించేందుకు అక్టోబర్‌ 5న భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఆదివాసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపునిచ్చింది. 1/70 చట్టం, ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల చట్టాలకు రక్షణ కల్పించడంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులను కాపాడాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మహాధర్నా విజయవంతానికి మంగువాయి గ్రామంలో ఆదివాసీ యువత, గ్రామ పెద్దలతో కలిసి నాయకులు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ జాతీయ నాయకులు యసం రాజు, ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కోర్సా నరసింహమూర్తి, గొండ్వానా సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ములుగు జిల్లా అధ్యక్షుడు పర్షిక సతీష్ మాట్లాడారు. ఆదివాసీ ప్రాంతాల భూములను పరిరక్షించేందుకు 1/70 చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఐదో షెడ్యూల్‌ ప్రాంతాలకు ఉన్న ప్రత్యేక రక్షణలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. చట్టాలను బలహీనపరిచే ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గిరిజనేతరులు 1/70 చట్టాన్ని సవరించాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆదివాసీల హక్కులను కాపాడే విధంగా రీకౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ భూముల ఆక్రమణలను అరికట్టి, భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నిరుద్యోగ ఆదివాసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ఐటీడీఏ పరిధిలోని 29 శాఖల్లో ఆదివాసీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, స్థానిక యువతకు ఉపాధి భరోసా కల్పించాలని కోరారు. అదేవిధంగా జీవో 3 స్థానంలో కొత్త జీవో తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీల విద్య, ఉద్యోగాలు, ఉపాధి, భూములు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఛలో భద్రాద్రి కొత్తగూడెం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఆదివాసీ గ్రామం నుంచి యువత, మహిళలు, గ్రామ పెద్దలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు.“1/70 చట్టాన్ని కాపాడుదాం–ఆదివాసీ హక్కులను సాధిద్దాం” అనే నినాదంతో అక్టోబర్‌ 5న భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొండ్వానా సంక్షేమ పరిషత్‌ ములుగు జిల్లా అధ్యక్షులు పూనెం ప్రతాప్‌, ఆదివాసీ నవనిర్మాణ సేన జిల్లా కన్వీనర్‌ కుంజ మహేష్‌, మండల అధ్యక్షుడు వాసం నారాయణ, తుడుందెబ్బ మండల అధ్యక్షుడు కణితి వెంకటకృష్ణ, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ మండల అధ్యక్షుడు తుర్స కృష్ణబాబు, గ్రామస్థులు పూనెం జీవన్‌, బొగ్గుల పాపారావు, మీడం బాలరాజు, కట్టం భీమయ్య, బొగ్గుల దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *