- ఎమ్మెల్యే కడియం శ్రీహరి చొరవతో బాధితుడికి ఆర్థిక సహాయం
- ఇప్పటివరకు చికిత్స కోసం రూ.7.50 లక్షల సహాయం
వేలేరు, అక్టోబర్ 9 (తెలుగు గళం):
వేలేరు మండల కేంద్రానికి చెందిన నోముల ప్రతాప్ (తండ్రి ప్రభాకర్) శస్త్రచికిత్స కోసం రూ.2.50 లక్షల విలువైన ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరైంది. ఆక్రోమెగలీ వ్యాధితో బాధపడుతున్న ప్రతాప్‌కు రెండో దశ శస్త్రచికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు ఈ ఆర్థిక సహాయం అందించారు.బాధితుడి ఆరోగ్య పరిస్థితి, చికిత్సకు అవసరమైన ఖర్చుల గురించి తెలుసుకున్న వేలేరు మాజీ సర్పంచ్ విజయపురి మల్లికార్జున్ ఈ విషయాన్ని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రూ.2.50 లక్షల ఎల్ఓసీ మంజూరుకు చొరవ తీసుకున్నారు.ఎమ్మెల్యే అందుబాటులో లేని కారణంగా మాజీ సర్పంచ్ విజయపురి మల్లికార్జున్ తన నివాసంలో యువజన కాంగ్రెస్ నాయకుడు పిండి అనుదీప్ సమక్షంలో బాధితుడు నోముల ప్రతాప్‌కు ఎల్ఓసీని అందజేశారు.ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ, తన రెండో దశ శస్త్రచికిత్స కోసం ఇది మూడోసారి అందిన ఎల్ఓసీ అని తెలిపారు. ఇప్పటివరకు తన చికిత్స కోసం మొత్తం రూ.7.50 లక్షల ఆర్థిక సహాయం పొందినట్లు పేర్కొన్నారు. తనకు వైద్య సహాయం అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ సర్పంచ్ విజయపురి మల్లికార్జున్, యువజన కాంగ్రెస్ నాయకుడు పిండి అనుదీప్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
