ప్రభుత్వ భూముల ఆక్రమణలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాంప్రభుత్వ భూముల ఆక్రమణలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం
  • భద్రాచలం ఐటీడీఏ పీఓపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • హైడ్రా తరహాలో ఏజెన్సీలో అక్రమ భవనాలు తొలగించాలి
  • ఆదివాసీ చట్టాలు పట్టవా? స్థానిక ఎమ్మెల్యే మౌనమెందుకు?
  • ప్రభుత్వ భూముల ఆక్రమణలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం
  • 1/70 చట్టం అమలులో నిర్లక్ష్యాన్ని సహించం: – జీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి దొర డిమాండ్

తెలుగు గళం వెంకటాపురం(నూగూర్) అక్టోబర్ 19:

ఐదవ షెడ్యూల్ ప్రాంతమైన భద్రాచలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు తక్షణమే స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ (జీఎస్పీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి దొర డిమాండ్ చేశారు. సోమవారం వెంకటాపురం ఆర్‌అండ్‌బీ అతిథిగృహం ఆవరణలో తాటి రాజేష్ అధ్యక్షతన నిర్వహించిన జీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భద్రాచలం ఐటీడీఏ ఎదుట హెలిప్యాడ్ సమీపంలోని సర్వే నంబర్ 83లో సుమారు ఏడు ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని ఆరోపించారు. దీనిపై జీఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు సోందె వీరయ్య ఎనిమిది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకుని, ఆక్రమణకు పాల్పడిన వారిపై 1/70 చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. భద్రాచలం ఐటీడీఏ పీఓపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు ఫ్యాక్స్ ద్వారా వినతిపత్రం పంపినట్లు తెలిపారు. ఏజెన్సీలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ప్రభుత్వ భూములను రక్షించాలని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణాల తొలగింపునకు ప్రభుత్వం హైడ్రా తరహాలో చర్యలు చేపట్టాలని, ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడానికి కారణమేంటో స్పష్టం చేయాలని కోరారు. ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకోకపోతే జీఎస్పీ ఆధ్వర్యంలో నిరంతర ఉద్యమాలు చేపడతామని పూనెం సాయి దొర హెచ్చరించారు. ఈ సమావేశంలో తాటి రాజేష్, తాటి భీమయ్య, లక్ష్మయ్య, రాజు, మహేష్, సుక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *