ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యం!
- పీఆర్సీ అమలు చేయాలి.. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలి: పీఆర్టీయూ తెలంగాణ డిమాండ్!
- పీఆర్టీయూ ములుగు జిల్లా ఉపాధ్యక్షుడిగా భావు సింగ్.. మహిళా అధ్యక్షురాలిగా గీతాంజలి ఎన్నిక!
తెలుగు గళం వాజేడు, అక్టోబర్ 28:
వాజేడు మండల కేంద్రంలో పీఆర్టీయూ తెలంగాణ కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు కరుటూరి సతీష్ కుమార్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ములుగు జిల్లా పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు కొయ్యడ సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోరిక రామన్న నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొయ్యడ సురేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీని అమలు చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు ఈహెచ్ఎస్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎస్సీ–2024 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు ప్రొబేషన్ డిక్లరేషన్, సర్వీస్ క్రమబద్ధీకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు డీడీఓలు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో వాంకుడోత్ భావు సింగ్ను పీఆర్టీయూ తెలంగాణ ములుగు జిల్లా ఉపాధ్యక్షుడిగా, కే. గీతాంజలిని వాజేడు మండల మహిళా అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన వారికి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని ఉపాధ్యాయులందరినీ ఐక్యం చేస్తూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్షులు కొయ్యడ సురేందర్, ప్రధాన కార్యదర్శి పోరిక రామన్న నాయక్, మండల అధ్యక్షులు కరుటూరి సతీష్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఈ. రాజు, నూనావత్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
