రూ.1,800 కోట్ల నిధుల ప్రకటనలు ఎక్కడ?

ఎన్నికల హామీలు మూడేళ్లయినా అమలు కాలేదని ప్రశ్నించిన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నాయిని నరేష్ గౌడ్

నిధుల కేటాయింపుపై వాగ్వాదం..దాడికి యత్నించారంటూ ఆరోపణలు.. అడ్డుకున్న గ్రామ మహిళలు

తెలుగు గళం న్యూస్ జఫర్‌గఢ్, నవంబర్ 23

నియోజకవర్గానికి రూ.1,800 కోట్ల నిధులు తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి..ఉప్పుగల్ గ్రామానికి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు, మాజీ ఉప సర్పంచ్ నాయిని నరేష్ గౌడ్ నిలదీశారు. ఎన్నికల సమయంలో గ్రామ అభివృద్ధికి ఇచ్చిన హామీలు మూడేళ్లు గడుస్తున్నా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించడంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.సోమవారం ఉప్పుగల్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరైన సందర్భంగా నాయిని నరేష్ గౌడ్ గ్రామ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.ఎన్నికల సమయంలో ఉప్పుగల్ నుంచి రఘునాథపల్లి వెళ్లే మార్గంలో ఆకేరు వాగుపై లోలెవల్ కాజ్‌వే నిర్మాణం, బీటీ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.అలాగే ఉప్పుగల్ దంసకాలువ మర్రి దగ్గర నుంచి నష్కల్ వరకు బీటీ రోడ్డు, పెద్దచెరువు వరకు గ్రావెల్ రోడ్డు, పోచమ్మ దేవాలయం నుంచి తమ్మడపల్లి ధోన్ల వరకు సీసీ రోడ్డు నిర్మిస్తామని ప్రకటించారని తెలిపారు.అంతేకాకుండా గ్రామంలోని ఆరు అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు, ఉప్పుగల్ ఉన్నత పాఠశాలలో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తామని బహిరంగ సభలో హామీ ఇచ్చారని పేర్కొన్నారు.అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఈ ఏడు పనులను పూర్తి చేస్తామని చెప్పి, మూడేళ్లు గడుస్తున్నా వాటి గురించి పట్టించుకోలేదని విమర్శించారు.ఒకవైపు నియోజకవర్గానికి రూ.1,800 కోట్ల నిధులు తీసుకొచ్చామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని, మరోవైపు ఉప్పుగల్ గ్రామానికి కనీస అభివృద్ధి నిధులు కూడా కేటాయించలేదని నాయిని నరేష్ గౌడ్ ఆరోపించారు. గ్రామానికి రూ.45 లక్షలు ఇచ్చామని ఎమ్మెల్యే వర్గం నుంచి సమాధానం రావడంతో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వ లేదా సీడీఎఫ్ నిధులు కావని, ఉపాధి హామీ కూలీల పనుల ద్వారా జనరేట్ అయిన 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులేనని స్పష్టం చేశారు. వాటిని ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన అభివృద్ధి నిధులుగా చెప్పడం సరికాదని ప్రశ్నించారు.ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. తాను గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుండగా కొందరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తనపై దాడికి ప్రయత్నించారని నాయిని నరేష్ గౌడ్ ఆరోపించారు.అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లిపోతుండగా కూడా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారని, అక్కడే ఉన్న గ్రామ మహిళలు వారిని అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని తెలిపారు.గ్రామానికి సంబంధించిన రోడ్లు, సాగునీటి సమస్యలు, అంగన్‌వాడీ భవనాలు, పాఠశాల అభివృద్ధి వంటి మౌలిక సమస్యలను పరిష్కరించాలని కోరడం తప్పా అని స్థానికులు ప్రశ్నించారు. ఇళ్ల కేటాయింపు విషయంలోనూ గతంలో ఇచ్చిన హామీలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా గ్రామాభివృద్ధి కోసమే ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ఎమ్మెల్యే స్పష్టమైన సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని గ్రామస్తులు విమర్శించారు.పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *