కరువు నివారణ చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలంకరువు నివారణ చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం

పంట నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం దారుణం”

​తక్షణమే కరువు సాయం, పంట నష్టపరిహారం ప్రకటించాలి”

​వరికి రూ. 30 వేలు, వాణిజ్య పంటలకు రూ. 50 వేలు చెల్లించాలి”

కరవు నివారణకు ​కేంద్రం రూ. 50 వేల కోట్ల నిధులు కేటాయించాలి

కరవు నిధులు తెచ్చేందుకు ఢిల్లీ కి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి

​రేషన్ కార్డుపై 14 రకాల నిత్యావసరాలు అందించాలి..

‘చలో ఢిల్లీ’కి సంపూర్ణ మద్దతు

విలేకరుల సమావేశంలో పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తో కలిసి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్

​రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండి, ఇప్పటికే 360కి పైగా మండలాల్లో కరువు పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అంచనా వేసి ప్రకటించినప్పటికీ, కరువు వల్ల నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మండిపడ్డారు. ఆదివారం ఖమ్మం లోని సిపిఐ ( ఎం ) ఖమ్మం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో అయన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుల తో పాటు ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పలు జిల్లాల కార్యదర్శులతో కలిసి మాట్లాడారు.
​ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో దాదాపు 24 లక్షల ఎకరాలకు పైగా పంటలు నష్టపోయాయని చెబుతున్నా, వాస్తవంగా మరో ఐదారు లక్షల ఎకరాలు అదనంగా నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఒక ఎకరంలో వాణిజ్య పంటలు వేస్తే రైతుకు రూ. 50 వేల వరకు, వరి లాంటి పంటలు వేస్తే రూ. 30 వేలకు తక్కువ కాకుండా ఖర్చవుతుండగా, ఇంత పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. పక్కనున్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు రైతులకు నష్టపరిహారం అందిస్తుంటే, మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి సాయం ప్రకటించలేదని ఆయన దుయ్యబట్టారు. ఈ కరువు కారణంగా బోర్లన్నీ ఎండిపోయి తాగునీటి, సాగునీటి సమస్యలతో పాటు ఉపాధి సమస్య కూడా తీవ్రమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
​కేవలం సమీక్షలు, సమావేశాలు జరపడం తప్ప రైతులను ఆదుకునే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ, మంత్రివర్గం గానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదని జాన్ వెస్లీ విమర్శించారు. తక్షణమే వరి పంటకు ఎకరాకు రూ. 30 వేలు, ఇతర వాణిజ్య పంటలకు రూ. 50 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలని సీపీఐ(ఎం) పక్షాన డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.

కేంద్రం రూ. 50 వేలు కోట్లు ఇవ్వాలి

ఈ మొత్తం నష్టాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుండి కనీసం రూ. 50 వేల కోట్లు డిమాండ్ చేయాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి ని కోరారు.
​పంటలు లేకపోవడంతో దాని ప్రభావం ఉపాధి కూలీలపై తీవ్రంగా పడిందని, కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను 90 శాతం నుండి 60 శాతానికి కుదించడం వల్ల పని దినాలు, కూలీల ఆదాయం తగ్గిపోతున్నాయని జాన్ వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా పట్టణాల్లో ఉండే వారికి కూడా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని, ఉపాధి కూలీకి రోజుకు రూ. 800 వేతనం వచ్చేలా, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహబూబ్‌నగర్ జిల్లా తరహాలోనే మిగతా జిల్లాల్లోనూ కూలీలు మళ్లీ వలసల బాట పట్టే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.

మద్దతు ధర పెంచి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

​వరి కొనుగోలు మద్దతు ధర విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందని, దిగుబడి తక్కువగా ఉన్నందున ప్రైవేట్ వ్యాపారులు ధాన్యాన్ని అడ్డగోలుగా కొనుగోలు చేసి, ఆ తర్వాత బియ్యం ధరలు పెంచి పేదలను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగానే నడుస్తున్నాయని, తక్షణమే ప్రభుత్వమే మద్దతు ధర పెంచి పూర్తిస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. కేజీ బియ్యం రూ. 100కు చేరుకున్నా ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చోవడం సరికాదని, ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు.

సర్ పేరుతో ఓట్ల చోరీ

​కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపుల్లో, ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా వివక్ష చూపుతూ వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, దీనిపై కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని కేంద్రంపై పోరాడాల్సిన అవసరం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా విఫలమైందని జాన్ వెస్లీ అన్నారు. మరోవైపు బీజేపీ నేతలు ‘డబుల్ ఇంజన్ సర్కార్’ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారని, కానీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ప్రజల వ్యతిరేకత ఎదుర్కొంటున్న బీజేపీ, ఇప్పుడు ‘సర్’ పేరుతో ఓట్ల దొంగిలింపు కార్యక్రమానికి తెరలేపిందని, దీనికి ఎన్నికల కమిషన్ కూడా వంతపాడుతోందని ఆరోపించారు. బెంగాల్‌లో 24 లక్షల ఓట్లను తొలగించిన తరహాలోనే, తెలంగాణలోనూ దాదాపు 93 లక్షల ఓట్లను బ్లాక్ లిస్టులో పెట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, ఓట్లను కాపాడుకోవడానికి ఈ నెల 26న దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు, సామాజిక సంస్థలు తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు సీపీఐ(ఎం) పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు.

హామీలు నిలబెట్టుకోవాలి

​రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారంపై ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు భర్తీ చేయలేదని జాన్ వెస్లీ గుర్తు చేశారు. సంక్షేమ పథకాల కోసం 16 లక్షలకు పైగా నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకున్నా ఒక్క పైసా కేటాయించలేదని, తక్షణమే ఉద్యోగాల భర్తీతో పాటు ఉపాధి కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల హామీ కూడా అమలు కావడం లేదని, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో 100 కేంద్రాల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు కనీసం ఇళ్ల స్థలాల పట్టాలైనా ఇవ్వకుండా, హైదరాబాద్ చుట్టూ ఉన్న వేల ఎకరాల ప్రభుత్వ భూములను అభివృద్ధి పేరుతో అమ్ముకుని రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని విమర్శించారు.
​రాష్ట్రంలో కోటి 16 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా, కార్డుపై మనిషికి 6 కేజీల బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదని జాన్ వెస్లీ ఎద్దేవా చేశారు. బయట నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, బియ్యాన్ని 10 కేజీలకు పెంచడంతో పాటు పప్పు, మంచినూనె సహా 14 రకాల సరుకులను రేషన్ కార్డుపై అందించాలని, తద్వారా దేశంలో ఉన్న 40 శాతం మంది మహిళల రక్తహీనత, పిల్లల పోషకాహార లోపాన్ని నివారించవచ్చని సూచించారు.

‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి సీపీఐ(ఎం) మద్దతు

​చివరగా, కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ యజమానులకు అనుకూలంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1 నుండి 3 వరకు కార్మిక సంఘాలు తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై శ్రామిక వర్గాలన్నీ సంఘటితమై బలమైన పోరాటాలకు సిద్ధం కావాలని, ప్రభుత్వాలు తక్షణమే స్పందించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని జాన్ వెస్లీ హెచ్చరించారు.
విలేకరుల సమావేశంలో సిపిఐ ( ఎం ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మీ, బండారు రవికుమార్,ఖమ్మం,నల్లగొండ, సూర్యాపేట, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పార్టీ కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, పి. వీరారెడ్డి, మల్లు నాగార్జునరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, జహంగీర్ తో పాటు పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *