ప్రజాప్రతినిధులారా.. రాజకీయ నాయకులారా.. అధికారులారా.. చెవిలో గుసగుసలు చెప్పే విలేకరులతో జాగ్రత్త!
మీడియాలో ఆధిపత్య ధోరణి తగదు.. ఇతర విలేకరులను కించపరిచే వైఖరిని విడనాడాలి
అక్రిడిటేషన్ ఉంటేనే జర్నలిస్టు కాదు.. వార్తలు సేకరించే ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించాలి
స్టేషన్ ఘన్పూర్ ప్రెస్మీట్ వివాదమే ఇందుకు నిదర్శనం.. శిరీష్ రెడ్డి తీరుపై మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టు సంఘాల ఖండన
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ నవంబర్ 23

జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో కొందరు మీడియా ప్రతినిధులు తామే గొప్పవారమని, తమదే పెద్ద మీడియా సంస్థ అని, తామే తోపులమనే ధోరణితో వ్యవహరిస్తూ ఇతర మీడియా ప్రతినిధులను యూట్యూబర్స్, పీడీఎఫ్, నాన్ అక్రిడిటేషన్ రిపోర్టర్లంటూ చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతటితో ఆగకుండా కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారుల వద్ద ఇతర విలేకరులపై లేనిపోని విషయాలు చెబుతూ వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ఇందుకు నిదర్శనంగా నిన్న స్టేషన్ ఘన్పూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిర్వహించిన మీడియా సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలను పలువురు గుర్తుచేస్తున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, రంగరాయిగూడెం సర్పంచ్ జూనుకుంట్ల శిరీష్ రెడ్డి అక్రిడిటేషన్ కార్డు ఉన్న విలేకరులే మీడియా సమావేశానికి రావాలంటూ ఆంక్షలు విధించిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారంపై పలువురు మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించడం, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం తెలిసిందే. ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ప్రతినిధుల మధ్య ఇలాంటి వివక్ష చూపడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రస్తుత మీడియా రంగంలో పత్రికలు, టీవీ ఛానళ్లు, డిజిటల్ మీడియా, కేబుల్ ఛానళ్లు ఇలా అనేక వేదికలు ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్నాయి. కేవలం అక్రిడిటేషన్ కార్డు ఉన్నవారే జర్నలిస్టులని, మిగతావారు జర్నలిస్టులు కారనే భావన సరైంది కాదు. అక్రిడిటేషన్ అనేది ప్రభుత్వ గుర్తింపు మాత్రమే తప్ప జర్నలిస్టు వృత్తికి అదొక్కటే కొలమానం కాదు.వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తూ వార్తలు సేకరిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న ప్రతి విలేకరికి తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలి. ఒక మీడియా సంస్థ పెద్దదా చిన్నదా, విలేకరికి అక్రిడిటేషన్ ఉందా లేదా అనే అంశాల ఆధారంగా వారి వృత్తిని తక్కువ చేసి చూడటం సమంజసం కాదు.తమను తాము గొప్పవారిగా భావించుకుంటూ ఇతర మీడియా ప్రతినిధులను అవమానించే ధోరణి జర్నలిస్టుల ఐక్యతకు విఘాతం కలిగించడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలకు కూడా విరుద్ధం. ముఖ్యంగా కొందరు విలేకరులు ఇతరులపై చాడీలు చెబుతూ అధికారుల వద్ద తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకోవడం సరైన పద్ధతి కాదు.కాబట్టి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు ఎవరి మాటలు విన్నా వాస్తవాలు తెలుసుకోవాలి. చెవిలో గుసగుసలు చెప్పే వారి మాటలకే ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రతి విలేకరికి సమాన గౌరవం కల్పించాలి. మీడియా సంస్థల మధ్య పోటీ ఉండవచ్చు కానీ జర్నలిస్టుల మధ్య వివక్ష, అవమానాలకు తావుండకూడదు. వార్తల సేకరణలో ఎలాంటి ఆంక్షలు, వివక్ష లేకుండా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రతి జర్నలిస్టును గౌరవించాలని కోరుతున్నాం.



