అభివృద్ధి పనుల కంటే ప్రతిపాదనలకే పెద్దపీట.. శాశ్వత ఫ్లెక్సీలతోనే ప్రచారం

ఎమ్మెల్యే ప్రగతి నివేదికపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు

చిల్పూర్ (తెలుగు గళం), నవంబర్ 27

జనగామ జిల్లా చిల్పూర్ మండలానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి మూడేళ్ల పాలనలో చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. మండలానికి మూడు నామాలు పెట్టడం తప్ప సాధించిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.

వెంకటేశ్వర్లపల్లె గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ.. కడియం మార్క్ అభివృద్ధి అంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం కాదని, శాశ్వత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడమేనని ఎద్దేవా చేశారు. ప్రచార ఆర్భాటాలకు చూపుతున్న శ్రద్ధను ప్రజా సమస్యల పరిష్కారంపై చూపడం లేదని ఆరోపించారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ సంక్షేమ, అభివృద్ధి పథకాలను చేరవేశామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే విడుదల చేసిన ప్రగతి నివేదికలో పూర్తయిన పనుల కంటే ప్రతిపాదనలే ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. ప్రతిపాదనలను సైతం అభివృద్ధి పనులుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు.మూడేళ్ల పాలనలో చేసిన పనులపై స్పష్టమైన వివరాలు ఇవ్వకుండా ప్రచారంతో కాలం గడపడం వల్ల ప్రజలు సంతృప్తి చెందరని అన్నారు. రాబోయే రోజుల్లో కడియం శ్రీహరితో పాటు ఆయన అనుచరులు కూడా ప్రజల నుంచి రాజకీయంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని డాక్టర్ తాటికొండ రాజయ్య హెచ్చరించారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *