ఎలుగుబంటి మరణం నిజంగా హృదయ విదారకం-రవి బాబు పిట్టల, పర్యావరణవేత్త

ఈ69న్యూస్ బ్యూరో రిపోర్టర్ (ముహమ్మద్ సలీం)
ఇటీవల స్టేషన్ ఘన్పూర్ రేంజ్ పరిధిలోని చాగల్లు – శివారెడ్డిపల్లి మధ్య జాతీయ రహదారి-163పై ఓ ఎలుగుబంటి రోడ్డు ప్రమాదంలో దారుణంగా మృతి చెందింది. ఇది సాంకేతికంగా రోడ్డు ప్రమాద మరణంగా పరిగణించినప్పటికీ, వాస్తవానికి ఇది మానవ నిర్లక్ష్యంతో జరిగిన హత్యతో సమానం. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972లోని షెడ్యూల్–I నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.ఈ భూమిపై ప్రతి జీవికి మనుషులతో సమానంగా జీవించే హక్కు ఉంది. ఇదే ప్రదేశంలో ఏదైనా ప్రముఖ వ్యక్తి మరణించి ఉంటే, “గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి పారిపోయింది” అంటూ కేసును నిర్లక్ష్యంగా వదిలేసేవారా? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై విచారణ నిర్వహించాల్సిన అధికారుల బాధ్యత, జవాబుదారీతనంపై కూడా ఇది తీవ్రమైన సందేహాలను కలిగిస్తోంది.ఈ విషాదానికి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ మనమందరం బాధ్యులమే. “అభివృద్ధి” పేరిట మన సౌకర్యాల కోసం అడవులను నాశనం చేయడం, వన్యప్రాణుల సహజ వనరులను క్రమంగా తగ్గించడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.ముఖ్యంగా వేసవి కాలంలో అడవుల్లో తాగునీటి కొరత ఏర్పడినప్పుడు, వన్యప్రాణులు ప్రాణాల కోసం కొత్త ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. నీరు కోసం అవి తమ నివాస ప్రాంతాలనుంచి ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. రాత్రివేళల్లో తిరిగి తమ గూటికి చేరుకునే క్రమంలో భయం, ఆందోళనతో పరుగులు తీస్తూ వాహనాలు, వేటగాళ్ల ఉచ్చులు, విద్యుత్ తీగలు, బావులు వంటి ప్రమాదాలకు బలవుతున్నాయి.వన్యప్రాణులకు సంవత్సరమంతా అవసరమైన నీరు, ఆహారం, ఆశ్రయం, సంచార మార్గాలు, సంభోగ భాగస్వాములు వంటి సహజ వనరులు మానవ కార్యకలాపాల వల్ల క్షీణిస్తున్నాయి. ఈ కొరత మరింత పెరిగితే, ఆ జంతువు తన ప్రాణరక్షణ కోసం కొత్త ప్రాంతాలకు వెళ్లక తప్పదు. అయితే ఆ కొత్త ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రమాదాలను అవి పూర్తిగా అంచనా వేయలేవు. ముఖ్యంగా రాత్రిచర జంతువులు రహదారులు దాటే సమయంలో వాహనాల వేగానికి బలవుతున్నాయి. ఇదే ఇలాంటి ప్రమాదాల ప్రధాన కారణం.అడవుల్లో నివసించే వన్యప్రాణుల సంరక్షణ బాధ్యత పూర్తిగా అటవీ శాఖ అధికారులదే. ఎండాకాలం గానీ, వర్షాకాలం గానీ, వాటికి అవసరమైన నీరు, సంచార మార్గాలు, రక్షణ చర్యలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. “అడవి ఉంది కదా… ఏదోలా బ్రతుకుతాయి” అనే నిర్లక్ష్య వైఖరి పూర్తిగా చట్టవిరుద్ధం.అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించినట్లయితే, ఉన్నతాధికారులు నిజానిజాలు వెలికితీయడానికి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.అలాగే అడవి ప్రాంతాల గుండా ప్రయాణించే వాహనదారులకు అవగాహన కల్పించడం అత్యవసరం. వేగ నియంత్రణ, హెచ్చరిక బోర్డులు, వన్యప్రాణుల కోసం అండర్‌పాసులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టాలి. వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై డ్రైవర్లు, వాహన యజమానులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటం ప్రభుత్వ, అటవీ శాఖ, రవాణా శాఖల బాధ్యత.అందువల్ల చాగల్లు – శివారెడ్డిపల్లి మధ్య NH-163పై ఎలుగుబంటి మరణ ఘటనను అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాము.ఈ ఘటనపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సంఘటనా స్థల పంచనామా, ఫోటోలు, వాహన ఆనవాళ్లు, సమీప సీసీటీవీ లేదా టోల్గేట్ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల వివరాలు సేకరించి దర్యాప్తు జరపాలి. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్‌ను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపాలపై కూడా విచారణ జరపాలి.షెడ్యూల్–I జంతువులకు అత్యున్నత రక్షణ కల్పించే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని మనవి.భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆ ప్రాంతాన్ని “వైల్డ్‌లైఫ్ హాట్‌స్పాట్”గా ప్రకటించి, స్పీడ్ కంట్రోల్, హెచ్చరిక బోర్డులు, వైల్డ్‌లైఫ్ అండర్‌పాసులు వంటి శాశ్వత చర్యలు చేపట్టాలి.