సహకార సంఘాలే రైతు అభ్యున్నతికి దిక్సూచి
ధర్మసాగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కేంద్రం ఏర్పాటు చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ 29 నుంచి జూలై 6 వరకు నిర్వహిస్తున్న సహకార వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా సహకార అధికారి బి. మోహన్, కేటీసీటీసీ ప్రిన్సిపాల్ యాకుబ్ ముఖ్య అతిథులుగా హాజరై సహకార రంగ ప్రాధాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి బి. మోహన్ మాట్లాడుతూ, రైతుల అభ్యున్నతికి సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. సహకార సంఘాల బలోపేతానికి ప్రతి రైతు భాగస్వామి కావాలని, సంఘాలు అందిస్తున్న రుణాలు, ఎరువులు, విత్తనాలు, ఇతర సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రైతులు సహకార సంఘాలతో అనుబంధాన్ని మరింత పెంపొందించుకోవడం ద్వారా వ్యవసాయ రంగంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.కేటీసీటీసీ ప్రిన్సిపాల్ యాకుబ్ మాట్లాడుతూ, సహకార వ్యవస్థ గ్రామీణ ఆర్థికాభివృద్ధికి వెన్నెముక వంటిదని పేర్కొన్నారు. రైతులు సహకార సంఘాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎఫ్‌పీఓ డొమైన్ నిపుణుడు నరేష్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ యాద కుమారస్వామి, డైరెక్టర్లు బిల్లా అమరేందర్ రెడ్డి, బొడ్డు లెనిన్, పోలుమారి విజయ, మడికంటి రాజయ్య, జంగా వీరయ్య, ధర్మసాగర్ డీసీసీ బ్యాంక్ మేనేజర్ వెంకటేష్, సూపర్వైజర్ శ్రీనివాస్ రెడ్డి, పీఏసీఎస్ కార్యదర్శి పింగిలి రాజిరెడ్డి, కార్యాలయ సిబ్బంది ఆవుల కుమారస్వామి, బొడ్డు ప్రభుదేవ్, పోలుమారి ప్రవీణ్ కుమార్, కలకోటి మురళీకృష్ణ, రాజేందర్‌తో పాటు రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.