లింగాలలో క్షేత్రస్థాయిలో రీ-సర్వే ప్రక్రియ పరిశీలన
పారదర్శకంగా,నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండ
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్న భూ రీ-సర్వే ద్వారా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ స్పష్టం చేశారు.మంగళవారం మండల పరిధిలోని లింగాల గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.పనుల పురోగతిని సమీక్షించిన అనంతరం,సర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా,కచ్చితత్వంతో గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఆయన నేరుగా రైతులతో మాట్లాడి,భూ సరిహద్దుల నిర్ణయంపై వారికున్న సందేహాలను నివృత్తి చేశారు.భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకే ప్రభుత్వం సమగ్రంగా రీ-సర్వే చేపడుతోందని తెలిపారు.రైతులు సర్వే సిబ్బందికి సహకరిస్తూ,తమ భూముల సరిహద్దులు,రికార్డుల నమోదును పరిశీలించుకోవాలని సూచించారు.ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి,తహసీల్దార్ శ్వేత,సర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్,మండల సర్వేయర్,రెవెన్యూ సిబ్బంది,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
