ఇసుక లారీ బీభత్సం.. సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతిఇసుక లారీ బీభత్సం.. సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి
  • ఇసుక లారీ బీభత్సం.. సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి
  • వరుసగా వాహనాలను ఢీకొన్న లారీ.. పలువురికి తీవ్ర గాయాలు

తెలుగు గళం ములుగు, అక్టోబర్ 8:

ములుగు జిల్లా పస్రా–తాడ్వాయి ప్రధాన రహదారిపై అటవీశాఖ చెక్‌పోస్ట్ సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక లారీ అదుపుతప్పి సీఆర్‌పీఎఫ్ వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఓ జవాన్ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం. సీఆర్‌పీఎఫ్ వాహనాన్ని ఢీకొన్న అనంతరం లారీ ఆగకుండా పస్రా వైపు వెళ్తున్న మరో కారును కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తాడ్వాయి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జూనియర్ సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న ఏటూరునాగారానికి చెందిన రమేష్ ముస్లిం తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఉన్న మరో వ్యక్తికి కూడా గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒకే ఇసుక లారీ వరుసగా రెండు వాహనాలను ఢీకొనడంతో రహదారిపై కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, వాహనదారులు స్పందించి క్షతగాత్రులను వాహనాల నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించేందుకు సహకరించారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా సమాచారం. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక లారీల రాకపోకలు అధికంగా ఉండటంతో పాటు డ్రైవర్లు వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇసుక లారీల వేగ నియంత్రణ, డ్రైవర్లకు విశ్రాంతి, వాహనాల తనిఖీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *