వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ పిలుపు
ఉపాధి కూలీల సమ్మెను జయప్రదం చేయాలి
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ పిలుపు
సత్తుపల్లి,ఆర్ సి,మే 8(తెలుగుగళం) న్యూస్ : ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని రామానగరం గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం కోసం దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగానే యూపీఏ ప్రభుత్వ కాలంలో 2005లో చట్టం అమలులోకి వచ్చిందన్నారు. 2006 అక్టోబర్ నుంచి అమలైన ఈ చట్టం వల్ల కోట్లాది వ్యవసాయ కార్మికులు, చిన్న మధ్యతరగతి రైతులకు ఉపాధి లభించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గడంతో పాటు వ్యవసాయ కార్మికులు కనీస వేతనాలను పెంచుకునే అవకాశం ఏర్పడిందన్నారు. మహిళలు, పురుషులకు సమాన వేతనాలు అమలైన తొలి చట్టం ఇదేనన్నారు.
ప్రపంచ ఆర్థిక మాంద్యం, కరోనా సంక్షోభ సమయంలో దేశ ప్రజలను ఆదుకున్నది ఉపాధి హామీ చట్టమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరుస్తూ కొత్త విధానాలను తీసుకొస్తోందని విమర్శించారు. కేంద్రం నిధుల వాటాను తగ్గించడం, వ్యవసాయ సీజన్లో పనులను నిలిపివేయడం, తక్కువ కూలి నిర్ణయించడం వంటి చర్యలు కార్మికుల హక్కులను హరించడమేనన్నారు.
పని ప్రదేశాల్లో రెండుసార్లు ఫోటో తీసే విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, పని దినాలను పెంచాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కూలీలందరికీ సంవత్సరానికి రూ.12 వేల ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం రామానగరం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో 100 మంది కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో: గ్రామ సర్పంచ్ ఒంటెద్దు వెంకటమ్మ, మండల నాయకులు పిల్లి నాగమణి, కువ్వారపు లక్ష్మణరావు, అయినంపుడి సుందరరావు, పెరుమాండ్ల వెంకటరత్నం, పిల్లి కుమారి, సాదు నిర్మల, దండు లక్ష్మి, కొండ కుమారి, వేల్పుల జ్యోతి, గోకారపు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.