మొక్కజొన్న రైతన్నకు అండగా ప్రభుత్వం
భూపాలపల్లి జిల్లాలోని మొక్కజొన్న సాగు చేసిన రైతాంగానికి మద్దతు ధర కల్పించడమే కాకుండా,కొనుగోలు ప్రక్రియలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు స్పష్టం చేశారు.శుక్రవారం జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) కార్యాలయంలో మార్క్ఫెడ్, మార్కెటింగ్, రవాణా, సహకార, పౌర సరఫరాలు,వ్యవసాయ శాఖల ఉన్నతాధికారులతో మొక్కజొన్న కొనుగోలు తీరుతెన్నులపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు.క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే,అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 49,175 హెక్టార్లలో మొక్కజొన్న సాగు జరిగిందని, అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇప్పటికే జిల్లాలో 7 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ఇప్పటివరకు 3,274 క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు చేశామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 65,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని,రైతులకు ఎక్కడా రవాణా లేదా నిల్వ ఇబ్బందులు తలెత్తకూడదని ఆదేశించారు.కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగడానికి గల కారణాలను విశ్లేషించిన ఎమ్మెల్యే,గోదాంల కొరత,హమాలీల లభ్యత రవాణా పరమైన అడ్డంకులను తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు.కొనుగోలు చేసిన పంటను భద్రపరిచేందుకు జిన్నింగ్ మిల్లులు,ప్రైవేట్ గోదాంల సామర్థ్యంపై పూర్తి స్థాయి నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని సూచించారు.తద్వారా నిల్వ సామర్థ్యాన్ని పెంచి కొనుగోళ్లను వేగవంతం చేస్తామని తెలిపారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. మండలాల వారీగా తహసీల్దార్ల నుంచి పంట నిల్వ సామర్థ్యంపై నివేదికలు సేకరిస్తున్నామని, నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్,మార్క్ ఫెడ్ డీఎం శ్రీదేవి,మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి,ఆర్టీఓ సందాని,సహకార అధికారి వాలియానాయక్, పౌర సరఫరాల డీఎం రాములు,వ్యవసాయ అధికారి బాబురావు,చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.