రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు
రేగొండ మండలంలోని రైతులకు పంపిణీ చేసేందుకు గాను ప్రభుత్వ రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయ అధికారి పెద్ది వాసుదేవరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.మండల పరిధిలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రంలో మొత్తం 100 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు.విత్తన క్వింటాలు పూర్తి ధర 16,350 రూపాయలు కాగా, ప్రభుత్వం అందిస్తున్న 50 శాతం రాయితీ (సబ్సిడీ) పోను 8,175 రూపాయల ధరకే రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు.దీని ప్రకారం 30 కిలోల బస్తా ధర 2,452.50 రూపాయలుగా నిర్ణయించబడిందని వివరించారు. జీలుగ విత్తనాలు కావలసిన రేగొండ మండల రైతు సోదరులు తమ భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం నకలు (జెరాక్స్) పత్రంతో సంబంధిత క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణాధికారిని (ఏఈఓ) సంప్రదించి అనుమతి పత్రం (పెర్మిట్) పొందవచ్చని,తద్వారా అగ్రోస్ రైతు సేవా కేంద్రంలో విత్తనాలు తీసుకోవచ్చని సూచించారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ,రైతు సోదరులు ఈ జీలుగ విత్తనాలను ఎకరానికి 12 కిలోల చొప్పున రాబోయే తొలకరి వర్షాలకు పొలాల్లో చల్లుకొని దున్నుకోవాలని తెలిపారు.
విత్తిన 45 రోజుల తర్వాత పంట పూత దశకు చేరుకుంటుందని,ఆ సమయంలో ఆ మొక్కలను భూమిలోనే కలియదున్నుకోవాలని వివరించారు.ఈ పద్ధతిని పాటించడం వల్ల నేలకు నత్రజని అంది భూమి అత్యంత సారవంతం అవుతుందని,ఫలితంగా పంట దిగుబడి గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు.అంతేకాకుండా భూమిలో చౌడు తీవ్రత కూడా తగ్గుతుందని,కాబట్టి మండలంలోని రైతు సోదరులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారి పెద్ది వాసుదేవరెడ్డి పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశారు