విద్యార్థులలో నైతిక విలువల పెంపునకు భగవద్గీత శిక్షణ ఎంతో ఆవశ్యకం
నేటి యాంత్రిక జీవనంలో విద్యార్థులు చదువుతో పాటు ఆధ్యాత్మికతను అలవరుచుకున్నప్పుడే పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని పొందగలరని హనుమకొండ రెండవ డివిజన్ కార్పొరేటర్ లావుడియా రవి నాయక్ పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాలోని ఈశ్వరి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో వేసవి సెలవులను పురస్కరించుకుని విద్యార్థినీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ‘భగవద్గీత పారాయణ శిక్షణ శిబిరాన్ని’ శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.ఓంకారేశ్వర స్వామి సమేత ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ రవి నాయక్ మాట్లాడుతూ.. భగవద్గీత కేవలం ఒక మత గ్రంథం మాత్రమే కాదని, అది మానవ జీవితానికి దిశానిర్దేశం చేసే అద్భుతమైన మార్గదర్శి అని కొనియాడారు. వేసవి సెలవుల్లో సెల్ ఫోన్లు, ఆటలకే పరిమితం కాకుండా, ఇటువంటి ఆధ్యాత్మిక శిక్షణ శిబిరాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ మరియు జ్ఞాపకశక్తి పెరుగుతాయని సూచించారు.సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగడానికి గీతా పారాయణం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఆలయ అర్చకులు,శిక్షణ నిర్వాహకులు బింగి రమేష్ ఆచార్యులు మాట్లాడుతూ.. ఈ శిక్షణ శిబిరం మొత్తం 41 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. శిక్షణలో భాగంగా విద్యార్థులకు శ్లోకాల ఉచ్చారణతో పాటు వాటి అంతరార్థాన్ని సులభంగా అర్థమయ్యేలా వివరిస్తామని చెప్పారు. శిక్షణ పూర్తయిన అనంతరం భగవద్గీతలోని మొదటి అధ్యాయంపై ప్రత్యేకంగా పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సొసైటీ తరపున విలువైన బహుమతులు,ప్రశంసా పత్రాలు అందజేస్తామని ప్రకటించారు.వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు మరిన్ని శిక్షణ తరగతులు అందుబాటులోకి తెస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఇటువంటి కార్యక్రమాలకు ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈశ్వరి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధులు, ఆంజనేయ స్వామి భక్తులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.