ఈనెల 7న స్టేషన్ ఘనపూర్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాక

డిప్యూటీ సీఎం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
ఈ69 న్యూస్, జనగామ మే 04
ఈ నెల 7న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘనపూర్ (స్టేషన్) పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సోమవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో శాసనసభ్యులు కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ పర్యటనలో భాగంగా దాదాపు రూ.50 కోట్ల వ్యయంతో నిర్మించిన 7 విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించడంతో పాటు మరికొన్ని ఉప కేంద్రాలకు శంకుస్థాపనలు జరగనున్నాయి. వేలేరు, చిల్పూర్, జఫర్గడ్, రఘునాథపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో కొత్తగా నిర్మించిన 132/33 కేవీ, 33/11 కేవీ ఉప కేంద్రాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.అలాగే లింగంపల్లి, పల్లగుట్ట, నష్కల్ ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులకు పునాది వేయనున్నారు.పల్లగుట్టలో సుమారు 5 వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ ప్రాంగణంలో తాగునీరు, విద్యుత్, భద్రత, వేదిక వంటి అన్ని సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.అదనంగా, రైతులు, మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు మోడల్ స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పూర్తి పనులను కూడా ఈ సందర్భంగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.డిప్యూటీ సీఎం పర్యటనలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులు స్పష్టం చేశారు.