ఘనంగా రైతు వారోత్సవాలు
ఘనంగా రైతు వారోత్సవాలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం’లో భాగంగా సోమవారం రేగొండ మండల కేంద్రంలో ‘రైతు వారోత్సవాలు’ ఘనంగా ప్రారంభమయ్యాయి.మే 4 నుండి 9వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ వారోత్సవాల తొలిరోజున భూసార పరీక్షలు,నేల ఆరోగ్యం,ఎరువుల యాజమాన్యంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి పర్యవేక్షకులు,మార్కెటింగ్ శాఖ సంయుక్త సంచాలకులు ఇ.మల్లేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే వానకాలం సీజన్లో రైతులు ప్రభుత్వం సూచించిన 8 రకాల వరి సన్న రకాలను సాగు చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా బి పి టి 5204, ఆర్ ఎన్ ఆర్ 15048, కె ఎన్ ఎం 1638, హేచుఎంటి సోనా, జైశ్రీరామ్, డబ్ల్యూజిఎల్ 962,డబ్ల్యూజిఎల్ 44, జెజిఎల్ 1798 వంటి రకాలను సాగు చేయడం ద్వారా నాణ్యమైన దిగుబడి పొందవచ్చని తెలిపారు.ఈ రకాలను సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ ధర కూడా లభిస్తుందని, తద్వారా ఆర్థికంగా లాభపడవచ్చని వివరించారు.భూసార పరీక్షల నివేదికల ఆధారంగా సమతుల్య ఎరువులను వాడటం వల్ల సాగు ఖర్చు తగ్గి, నేల సారం పెరుగుతుందని సూచించారు.రేగొండ సర్పంచ్ వానరాశి మౌనిక మాట్లాడుతూ.. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి లాభసాటి వ్యవసాయం చేయాలని కోరారు. భూపాలపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏ డి ఏ) రమేష్,మండల వ్యవసాయ అధికారి (ఏ ఓ) పెద్ది వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని ప్రతి రైతుకు విత్తనాలు,ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్,భూపాలపల్లి మార్కెటింగ్ సెక్రటరీ, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏ ఈ ఓ) భరత్, గోవర్ధన్, మండలంలోని వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.క్షేత్రస్థాయిలో రైతులకు ఎదురయ్యే సందేహాలను అధికారులు ఈ సందర్భంగా నివృత్తి చేశారు.