లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం
భూపాలపల్లి జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం పూర్తిగా చట్ట విరుద్ధమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ మధుసూదన్ స్పష్టం చేశారు.బుధవారం ఐడీఓసి కార్యాలయంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పీసీపీఎన్డీటీ చట్టం అమలుపై జిల్లా సలహా కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,గర్భస్థ శిశువు లింగాన్ని నిర్ధారించడం చట్టరీత్యా నేరమని,ఎవరైనా స్కానింగ్ కేంద్రాల్లో ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తే రూ.10 వేల జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించారు.లింగ నిర్ధారణ వంటి అక్రమ చర్యలను అరికట్టడంలో వైద్యులు,స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలు తప్పనిసరిగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని డీఎంహెచ్ఓ స్పష్టం చేశారు.ప్రతి కేంద్రంలో పరికరాలను నిర్వహిస్తున్న వైద్యుల వివరాలను నమోదు చేయడంతో పాటు గర్భిణులకు తగిన సౌకర్యాలు కల్పించాలన్నారు.అలాగే వైద్యుల వివరాలు,స్కానింగ్ రుసుములను గోడలపై స్పష్టంగా ప్రదర్శించాలి.గర్భిణుల స్కానింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేసి వారి సంతకాలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా లింగ నిర్ధారణ నిషేధంపై అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలు,పోస్టర్లు ఏర్పాటు చేయాలని,ప్రైవేట్ ఆస్పత్రులు స్కానింగ్ కేంద్రాలు గర్భిణులు,వారి కుటుంబ సభ్యులకు చట్టంపై పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు.ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.ఈ సమావేశంలో పీఓ డాక్టర్ శ్రీదేవి,డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ దేవేందర్,డాక్టర్ సుధాకర్,డాక్టర్ సంధ్య,ఎన్జీవో ప్రతినిధి శ్యాంప్రసాద్,డెమో శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.