నూతన సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు మంత్రి శ్రీధర్ బాబు ఘన సన్మానం
మహాదేవపూర్ గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్‌లను రాష్ట్ర ఐటీ శాఖ,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బుధవారం ఘనంగా సన్మానించారు.మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో స్వాములు నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజలో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం మహాదేవపూర్ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన హసీనా బాన్ అక్బర్ ఖాన్‌ను, ఉపసర్పంచ్‌గా ఎన్నికైన తుంగల శ్రీజను, అలాగే పలువురు వార్డు సభ్యులను శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలన సాగించాలని నూతన ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేయాలని, గ్రామ సమస్యల పరిష్కారానికి సమిష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, మాజీ పాక్స్ చైర్మన్ చల్ల తిరుపతయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోత రామకృష్ణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.