సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం వద్దు
గీత దాటితే వేటు తప్పదు”-డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరిక తెలంగాణ రాష్ట్ర పోలీసు సిబ్బంది సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవద్దని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు ఆయన పోలీసు శాఖ అంతటికి ఒక అంతర్గత లేఖ ద్వారా హెచ్చరికలు చేశారు.కుటుంబ కలహాలు,ఆస్తి విభజనలు,భూమి వివాదాలు వంటి అంశాలు పూర్తిగా సివిల్ కోర్టుల పరిధిలోకి వస్తాయని,అలాంటి కేసుల్లో పోలీసులు తలదూర్చడం పూర్తిగా తప్పని డీజీపీ స్పష్టం చేశారు.పోలీసు స్టేషన్లను పంచాయితీ అడ్డాలుగా లేదా సెటిల్మెంట్ సెంటర్లుగా మార్చడం అనర్హమైన చర్య అని పేర్కొన్నారు.
“అధికారులెవరూ మినహాయింపు కాదు”
సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేసినట్లయితే హోం గార్డు నుంచి ఐపీఎస్ అధికారి వరకూ ఎవరికీ మినహాయింపు ఉండదని,తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.ప్రస్తుతం ఇలాంటి వ్యవహారాల్లో పాల్గొన్న స్టేషన్లు,అధికారులపై కూడా వెంటనే చర్యలు చేపడతామని తెలిపారు.
“ఫిర్యాదులు కోర్టులకే దారి మళ్లించాలి”
సివిల్ వివాదాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిని సంబంధిత సివిల్ కోర్టులు లేదా న్యాయపరమైన మార్గాలకు మళ్లించాలి తప్ప పోలీసు జోక్యం ఉండకూడదని సూచించారు.
“యూనిఫాం-అవినీతి కలవకూడదు”
పోలీసు యూనిఫాం అవినీతికి దూరంగా ఉండాలని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.అక్రమాలు,నీతి లోపాలపై కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడితే ప్రజల్లో పోలీసు శాఖపై నమ్మకం కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.పోలీసు ప్రవర్తన ప్రజా విశ్వాసానికి నిదర్శనం కావాలి,పోలీసుల ప్రవర్తన యూనిఫామ్‌కు గౌరవాన్ని,ప్రభుత్వానికి ప్రతిష్టను,సమాజంలో శాంతి భద్రతలను కాపాడేలా ఉండాలని డీజీపీ తన లేఖలో పేర్కొన్నారు.