రైతుల గోడు విన్న ఎర్రబెల్లి దయాకర్ రావు
బస్తా మాదే,ఖర్చు మాదే… కొనే నాథుడే లేడు
రైతుల గోడు విన్న ఎర్రబెల్లి దయాకర్ రావు
•ఎర్రటి ఎండలో రైతు కన్నీరు: మక్కలు, వరి కొనుగోలు వెంటనే చేపట్టాలి-మాజీ మంత్రి డిమాండ్
తెలుగు గళం న్యూస్ నెక్కొండ/మే8
వరంగల్ జిల్లా: నెక్కొండ మండలం ఫణికర గ్రామ శివారులోని సాయిరెడ్డిపల్లెలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గోదామును పరిశీలించారు.అటువైపు వెళుతున్న ఆయనను చూసిన రైతులు ఒక్కసారిగా వాహనాన్ని ఆపి తమ గోడు వెళ్లబోసుకున్నారు.కిలోమీటర్ల కొద్దీ వాహనాల క్యూ:సుమారు 200కు పైగా వాహనాలతో రైతులు రోజుల తరబడి రోడ్డుపైనే పండిన పంటతో నిరీక్షిస్తున్నారు.గోదాముల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బస్తాకు 300 రూపాయల ఖర్చు అవుతున్నా కళ్లాల నుండి పంట కదలడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. “బస్తా మాదే, అమాలి ఖర్చు మాదే, లారీ కిరాయి మాదే… అయినా మా పంట కొనే నాథుడే లేడు”అని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ…ఎన్నడూ లేని విధంగా రైతులను ఇబ్బందులు పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదు.ప్రభుత్వ మెడలు వంచైనా రైతుల పక్షాన ఉద్యమిస్తాం.ప్రతి గింజ కొనే వరకు పోరాడుతాం. ఎర్రటి ఎండలో రైతులను చూస్తే రేవంత్ రెడ్డికి గోస అనిపించడం లేదా?బోకస్ మాటలు,చిల్లర మాటలు మానుకొని మొక్కజొన్న, వరి కొనుగోలుపై శ్రద్ధ పెట్టాలి” అని డిమాండ్ చేశారు.బస్తాల కొరతతో మొక్కజొన్న కొనుగోలు సరిగా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం కనీసం రైతులకు విత్తనాలు,ఎరువులు ఇవ్వలేకపోతోంది.సకాలంలో రైతుబంధు ఇవ్వకపోగా కనీసం పండిన పంటను మద్దతు ధరకు కొనే పరిస్థితిలో కూడా లేదు.ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వం”అని విమర్శించారు.
రాష్ట్రంలో 11లక్షలఎకరాల్లో మక్కజొన్న పండితే,సగం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదు.ప్రారంభమైనవి కూడా లారీలు లేక,బస్తాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. మద్దతు ధర రూ.2400ఉంటే రూ.1600-1800కే అమ్ముకుని రైతులుమోసపోతున్నారు.మొక్కజొన్న కొనుగోలుపై ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయమే తీసుకోలేదు.ఆరుగాలం కష్టపడ్డ రైతులు మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లి సగం ధరకే జొన్నలు అమ్ముకునే దుస్థితి వచ్చింది.వడ్లు కూడా రోడ్ల మీదనే ఉన్నాయి”అని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి మక్కలు కొనుగోలు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.