భూసేకరణ,ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల అమలులో వేగం పెంచండి
ప్రజా సంక్షేమ దృష్ట్యా ప్రభుత్వం చేపట్టే వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, అలాగే నిర్వాసితులకు అందాల్సిన పునరావాస, పునర్నిర్మాణ (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీలను సకాలంలో అందించాలని ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివ కుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు, జెన్కో, సింగరేణి సంస్థలకు జరుగుతున్న భూసేకరణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆయన రెవెన్యూ, సర్వే, సింగరేణి, జెన్కో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా భూసేకరణకు సంబంధించిన పబ్లిక్ నోటిఫికేషన్ (పిఎన్),ప్రిలిమినరీ డిక్లరేషన్ (పిడి), అవార్డు పాసింగ్ తదితర ప్రక్రియల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నిర్వాసితులకు అందాల్సిన ప్యాకేజీలను ఎలాంటి ఆలస్యం లేకుండా, నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకతతో అందించాలన్నారు. భూసేకరణ ప్రక్రియలో ఎక్కడా ఆటంకాలు కలగకుండా చూడాలని, ప్రతి ఒక్క నిర్వాసితుడికి న్యాయం జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వం ఈ అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని గుర్తుచేస్తూ,భూసేకరణకు సంబంధించి వచ్చే అభ్యంతరాలు,ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకుంటూ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. జిల్లాలో అమలవుతున్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీల అమలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని తెలిపారు. ఎటువంటి ఫిర్యాదులకు తావులేకుండా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని,సమస్యలు తలెత్తిన వెంటనే క్షేత్రస్థాయిలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.భూసేకరణ పూర్తయిన వెంటనే సదరు భూములను ఇరిగేషన్ శాఖకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో భూపాలపల్లి,కాటారం ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, జెన్కో సీఈ శ్రీ ప్రకాష్, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి,అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు