లక్షల ఇళ్లకు జీరో బిల్లు భరోసా- ఏడీఈ
లక్షల ఇళ్లకు జీరో బిల్లు భరోసా- ఏడీఈ
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం ద్వారా లక్షలాది కుటుంబాలు ఉచిత విద్యుత్ సదుపాయాన్ని పొందుతున్నాయని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యుత్ శాఖ ఏడీఈ వాంకుడోత్ తిరుపతి అన్నారు.వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన ప్రజాపాలన-ప్రగతి నివేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రేషన్ కార్డు కలిగిన అర్హులైన గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఈ పథకం ప్రజలకు భారీ ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు.మండల రైతాంగానికి 24 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్ సరఫరా కొనసాగుతోందని, మండలంలోని అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు నిరంతర విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు.రైతులు ఉత్పత్తి చేసే సౌర విద్యుత్‌ను డిస్కంల ద్వారా టి జి ఈ ఆర్ సి నిర్ణయించిన స్థిర ధరకు 25 సంవత్సరాల పాటు కొనుగోలు చేస్తారని చెప్పారు.వ్యక్తిగత రైతులు, రైతు సమూహాలు, సహకార సంఘాలు,పంచాయతీలు, ఈ ఎఫ్ ఓ లు,స్వయం సహాయక సంఘాలు,గ్రామ సంఘాలు ఈ పథకానికి అర్హులని వెల్లడించారు.
“వ్యవసాయాన్ని సోలార్‌తో జోడించి రైతుకు స్థిరమైన ఆదాయం – దేశానికి స్వచ్ఛ ఇంధనం అందిద్దాం” అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఏడీఈ తిరుపతి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని సర్పంచ్‌లు, విద్యుత్ శాఖ అధికారులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.