భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం తెలుగు గళం న్యూస్
ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఇన్చార్జ్ ఎంపీడీవో శ్రీనివాస్ కు వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణంలో సొంత ఇల్లు లేని అద్దె ఇండ్లలో ఉంటున్న పేద మధ్యతరగతి ప్రజలు సుమారు 4000 మంది ఉన్నారని కానీ ఇందిరమ్మ ఇల్లు మాత్రం అరాకొరగా భద్రాచలం కు కేటాయిస్తున్నారని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అన్నారు. భద్రాచలం గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ (వందరోజుల పనులు) కార్డులు లేని వారికి ఇవ్వాలని, కార్డులు ఉన్నవారికి పనులు చూపించాలని డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణంలో నివాసం ఉంటూ ఇతర ప్రాంతాలకు వ్యవసాయ పనులకు వెళుతున్న వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా పథకం అమలు చేసి ఏడాదికి 12000 రూపాయలు ఇవ్వాలని అన్నారు. వృద్ధాప్య,వితంతు,ఒంటరి మహిళా పెన్షన్లు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి మంజూరు చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పింఛను 4000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణంలో వివిధ కాలనీలలో రోడ్లు, డ్రైన్లు, కరెంటు తదితర స్థానిక సమస్యలు పేరుకుపోయాయని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం రాజీలేని పోరాటం నిర్వహిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వై. వెంకట రామారావు, పి సంతోష్ కుమార్ డి సీతాలక్ష్మి పార్టీ సీనియర్ నాయకులు బిబిజి తిలక్,పట్టణ కమిటీ సభ్యులు నకిరీకంటి నాగరాజు, ఉస్తెల జ్యోతి,కొలగని రమేష్, కనక శ్రీ, కుంజా శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ నాయకులు రవీంద్ర, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుయ్యని సౌభాగ్యం,మడకం పద్మ,రమాదేవి, సీతామహాలక్ష్మి, కుంజ విజయ, కాకా రమణ తదితరులు పాల్గొన్నారు.

