telugu galam news e69news local news daily news today newstelugu galam news e69news local news daily news today news

మానవాళి విముక్తి పోరాటాల వేగుచుక్క లెనిన్

కేవలం 54 సంవత్సరాల తన జీవితకాలంలో లెనిన్‌ ప్రపంచ కార్మిక విప్లవ ప్రగతిపై చెరగని ముద్ర వేశాడు. మార్క్సిజం అనే సృజనాత్మక శాస్త్ర సారాన్ని సమగ్రంగా అవగాహన చేసుకుని, దాన్ని సమకాలీన సమాజ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది రష్యన్‌ విప్లవాన్ని విజయపథంవైపు నడిపించాడు. అలా ప్రపంచంలో మొట్టమొదటి సోషలిస్టు దేశంగా సోవియట్‌ యూనియన్‌ ఆవిర్భవించింది. మార్క్సిజంపైన జరుగుతున్న అన్ని రకాల వక్రీకరణలకు వ్యతిరేకంగా పోరాడుతూ, విప్లవోద్యమాన్ని పట్టాలు తప్పకుండా కాపాడి మార్క్సిజాన్ని సుసంపన్నం చేశాడు. విప్లవోద్యమ గమనంలో సంభవించే రకరకాల మలుపుల్లో సరైన ఎత్తుగడలను అనుసరించటంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ఆయన ఒక మార్క్సిస్టు సిద్ధాంతవేత్త, వ్యూహకర్త, గొప్ప ఎత్తుగడల రూపకర్త. ప్రపంచ వ్యాప్తంగాను, ప్రపంచంలోని ప్రతి దేశంలోను విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవటానికి ఆయన రచనలను నిరంతరం అధ్యయనం చేయటం అవసరం.
మార్క్సిజం సారంపైన పట్టును సాధించటం
మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథంపైన, దాని సృజనశీలత, శాస్త్రీయతల పైన సమగ్రమైన అవగాహన ఏర్పరచుకుని లెనిన్‌ ప్రపంచ విప్లవోద్యమాన్ని నడిపించగలిగాడు. మార్క్సిజమనే అపూర్వ భాండాగారానికి ఆయన చేసిన అసమాన సేవలు, పథ నిర్దేశన గురించి లోతుగా అర్థం చేసుకోవటానికి విడివిడిగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ”రాజ్యం-విప్లవం”, ”సోషల్‌ డెమోక్రసీకి చెందిన రెండు ఎత్తుగడలు”, ”ఏం చేయాలి?”, ”సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ వ్యవస్థ అత్యున్నత దశ” వంటి లెనిన్‌ ప్రముఖ రచనలను చాలామంది అధ్యయనం చేశారు. నిజానికి ఇలా చేయటం చాలా ముఖ్యం. వర్తమాన పరిస్థితులలో మానవాళి విముక్తి కోసం జరిగే పోరాటాలను ముందుకు తీసుకుపోవటానికి ప్రతి విప్లవకారుడు లెనిన్‌ రచనల సారాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది.
అయితే ప్రపంచ కార్మికోద్యమం, రష్యన్‌ విప్లవ పథంలో సంభవించిన వివిధ మలుపుల్లో లెనిన్‌ ఈ రచనలను ఎందుకు చేయవలసి వచ్చిందనే విషయంపై అవగాహన ఏర్పరచుకోవటం కూడా అంతే ముఖ్యం.లెనిన్‌ మార్క్సిజాన్ని ఎంత గొప్పగా అంతర్లీనం చేసుకున్నాడో తెలియాలంటే ఆయన చేసిన రెండు సూత్రీకరణలను ఒక చోటకు చేరిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. మొదటగా ఆయన ”ప్రజలకు స్నేహితులు ఎవరు?” అనడిగాడు. ”లక్షలాది శ్రమజీవులు మార్క్సిజం వైపు ఆకర్షింపబడటానికి కారణం మార్క్సిజం ఏక కాలంలో విప్లవకర, అత్యంత శాస్త్రీయ పార్శ్వాలు కలిగిన ఏకైక తత్వశాస్త్రం కావటమే. మార్క్స్‌, ఏంగెల్స్‌ తమ జీవితకాలంలో ఈ రెండింటినీ కలపటం వల్లనే ఇవి కలిసి లేవు. మార్క్సిజం ఈ రెండింటినీ తనలో విడదీయరాని బంధంలో ఉంచుతుంది. రెండవది, నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా విశ్లేషించటం మార్క్సిజానికి అత్యంత కీలకమైనది. అది మార్క్సిజానికి సజీవ ఆత్మ.
మార్క్సిజంలోని విప్లవకర, అత్యంత శాస్త్రీయ పార్శ్వాలను కలిపి వుంచటం ద్వారానే విప్లవ లక్ష్యమైన మానవాళి విమోచన నెరవేరటం సాధ్యం. ఒక పార్శ్వానికి ఎక్కువ, మరొక పార్శ్వానికి తక్కువ ప్రాధాన్యతనిస్తే అది వక్రీకరణలకు దారితీస్తుంది. విప్లవ సాధ్యతను విస్మరించి పరిస్థితిని కేవలం శాస్త్రీయంగా విశ్లేషించటంపైనే దృష్టిని కేంద్రీకరిస్తే అది సంస్కరణ వాద వక్రీకరణకు దారితీస్తుంది. అలాగే పరిస్థితిని శాస్త్రీయంగా విశ్లేషించటాన్ని విస్మరించి విప్లవ నినాదాలను ఇవ్వటానికి పాల్పడితే అది వామపక్ష దుందుడుకు వాద వక్రీకరణకు దారితీస్తుంది. అటువంటి వక్రీకరణలు జరగకుండా చూడాలంటే మార్క్సిజంలోని ఈ రెండు పార్శ్వాలను సరైన రీతిలో కలిపి ఉంచటం అవసరం.
‘నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా విశ్లేషించటం’ అంటే నిర్దిష్ట పరిస్థితులను వస్తుగతంగా అంచనా వేసి దాని ఆధారంగా సరియైన విప్లవ విశ్లేషణ చేయటం. స్వీయ మానసిక ధోరణితో నిర్దిష్ట పరిస్థితులను తప్పుగా అంచనా వేస్తే అది లోపభూయిష్టమైన, తప్పుడు రాజకీయ విశ్లేషణకు దారితీసి విప్లవోద్యమాన్ని వక్రమార్గం పట్టిస్తుంది. కాబట్టి మార్క్సిజంలోని రెండు పార్శ్వాలను కలిపి వుంచి నిర్దిష్ట పరిస్థితులను విప్లవకారుడు సమర్థవంతంగా వస్తుగతంగా చేసే విశ్లేషణ ఆధారంగానే విప్లవోద్యమం ముందుకు సాగగలుగుతుంది. ఒకవేళ సమగ్ర విశ్లేషణ ఆధారంగా చేసిన అంచనాతో విప్లవోద్యమం సరైన రాజకీయ-ఎత్తుగడల పంథాను రూపొందించి, అనుసరించినా దాని ఫలితం పార్టీ బలంపైనే ఆధారపడి ఉంటుంది. రాజకీయ పంథా నూటికి నూరు శాతం సరైనదైనప్పటికీ దాన్ని ప్రజల వద్దకు తీసుకుపోగలిగే పార్టీ లేనప్పుడు అది ప్రభావవంతంగా ఉండదని స్టాలిన్‌ లెనినిస్టు అవగాహనతో చెప్పాడు. ఆ విధంగా విప్లవోద్యమం పురోగమించటానికి పార్టీ నిర్మాణం, దాని శక్తిసామర్థ్యాలు (వీటినే లెనిన్‌ ‘వ్యక్తిగత కారకం (సబ్జెక్టివ్‌ ఫ్యాక్టర్‌) అన్నాడు) ప్రధానమైన పాత్రను పోషిస్తాయి.
వీటన్నింటిలో సంస్కరణ, వామపక్ష దుందుడుకువాద (దీన్నే లెనిన్‌ ‘శైశవ రుగ్మత’ అన్నాడు) లక్షణాలకు సంబంధించిన అన్నిరకాల వక్రీకరణలపైన లెనిన్‌ అలుపెరుగని పోరాటం చేశాడు. విప్లవ ప్రగతి కీలక తరుణాలలో వక్రమార్గం పట్టకుండా చూడటానికి వీటికి చెందిన ప్రతి వక్రీకరణను ఎండగట్టి, కార్మికోద్యమ స్పష్టత కోసం లెనిన్‌ అనేక గొప్ప రచనలను చేశాడు. విప్లవోద్యమానికి సరైన దిశా నిర్దేశం చేయటానికి, అంతిమంగా విజయం సాధించటానికి, భావజాలపరంగా కార్మికోద్యమంలో పేరొందిన అనేకమంది నాయకులతో ఆయన పోరాటం చేయవలసి వచ్చింది.
మార్క్సిజాన్ని తాజాపర్చటం
రష్యన్‌ విప్లవాన్ని విజయవంతం చేయటం దేశంలోని పరిస్థితులు, వాటి వైరుధ్యాల విశ్లేషణతో పాటు ప్రపంచ పరిస్థితులను, వాటి వైరుధ్యాలను సరైన రీతిలో విశ్లేషించకుండా రష్యా విప్లవంతోసహా ఏ విప్లవమూ విజయవంతం కాజాలదనే విషయాన్ని మార్క్స్‌ని, మార్క్సిజాన్ని సమగ్రంగా అర్థంచేసుకున్న తరువాత లెనిన్‌ గ్రహించాడు. ప్రపంచ స్థాయి పెట్టుబడిదారీ వ్యవస్థలో వస్తున్న మార్పులను గమనిస్తూ పెట్టుబడిదారీ వ్యవస్థపైన, దానిలోని ధోరణులపైన మార్క్స్‌ చేసిన సునిశిత విశ్లేషణ ఆధారంగా పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి కొనసాగుతుండగా దానిలో కేంద్రీకరణ, సాంద్రీకరణ ధోరణి నూతన స్థాయికి చేరుకుని గుణాత్మక మార్పుకు లోనైందని లెనిన్‌ విశ్లేషించాడు.
మార్క్స్‌ తన జీవిత చరమాంకంలో గుత్త పెట్టుబడిదారీ ధోరణులను గమనించాడు. మార్క్స్‌ మరణానంతరం ఏంగెల్స్‌ దీన్ని ‘పెట్టుబడి’ గ్రంథం మూడవ సంపుటిలో పొందుపరిచాడు. గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధితో పెట్టుబడి పాలన యావత్‌ ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకుందని, అది సామ్రాజ్యవాద దశ అని, ఇదే పెట్టుబడిదారీ వ్యవస్థ అత్యున్నత దశ అని 20వ శతాబ్దం ప్రారంభంలో లెనిన్‌ సూత్రీకరించాడు. సామ్రాజ్యవాదంతో ఆవిర్భవించిన వైరుధ్యాలను సరైన రీతిలో అంచనా వేసి, విశ్లేషించి సామ్రాజ్యవాద దశలో పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచాన్ని గొలుసులతో బంధించిందని లెనిన్‌ చెప్పాడు. సామ్రాజ్యవాద దేశాల మధ్య వైరుధ్యాలను ఉపయోగించుకుని ఈ సామ్రాజ్యవాద గొలుసులో అత్యంత బలహీనంగా వున్న లింక్‌ని తెగ్గొట్టాలి. ఆనాటి మానవ చరిత్రలో రష్యా అటువంటి బలహీనమైన లింక్‌గా ఉంది. సామ్రాజ్యవాద దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని (కొనసాగుతున్న మొదటి ప్రపంచ యుద్ధాన్ని) అంతర్యుద్ధంగా మార్చాలని, శాంతి, తిండి, భూమి నినాదాన్ని రష్యన్‌ ప్రజల ముందుంచాలని లెనిన్‌ పిలుపునిచ్చాడు. అటువంటి నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా చేసిన విశ్లేషణ ఆధారంగా రష్యాలో విప్లవోద్యమానికి ఆయన నాయకత్వం వహించి అంతిమంగా 1917 అక్టోబర్‌లో విప్లవాన్ని విజయ పథంవైపు నడిపాడు.
సామ్రాజ్యవాదం పైన లెనినిస్టు అవగాహన, విశ్లేషణ, సామ్రాజ్యవాద దేశాల మధ్య ఆవిర్భవించిన వైరుధ్యాలు రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. దీనిలో జర్మనీ పాత్రతో ఒక నూతన ప్రపంచ క్రమం ఏర్పడటానికి దారితీసింది. సామ్రాజ్యవాద దేశాల మధ్య వైరుధ్యాలను ఉపయోగించుకోవటంవల్ల ఫాసిజం ఓటమిపాలైంది. అది తూర్పు ఐరోపా ఖండం విమోచనకు దారితీసింది. తత్ఫలితంగా సోషలిజానికి అనుకూలంగా వర్గ పొందికలో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన మార్పుకు ప్రతిస్పందనగా సంక్షేమ రాజ్య భావన అనే ఒక గుణాత్మకమైన నూతన దశలోకి పెట్టుబడిదారీ దేశాలు ప్రవేశించాయి.
నేడు మనం మన పార్టీని మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీగా పిలుచుకుంటు న్నామంటే మనం ఉద్దేశపూర్వకంగా లెనిన్‌ మార్క్సిజాన్ని అన్ని విధాలుగా సంపద్వంతం చేసిన విషయాన్ని, అన్ని రకాల వక్రీకరణలకు (ముఖ్యంగా సంస్కరణవాద, వామపక్ష దుందుడుకువాద వక్రీకరణలకు) వ్యతిరేకంగా పోరాడిన విషయాన్ని, కార్మిక, కర్షక మైత్రి అక్షం చుట్టూ దోపిడీకి గురౌతున్న వర్గాలను సమీకరించే ఎత్తుగడలను రూపొందించిన విషయాన్ని, మానవాళి విమోచనకు చరిత్ర గమనాన్ని ప్రభావితం చేయగలిగే, విప్లవోద్యమాన్ని ప్రగతి పథంలో సాగేలా చేసే ఎత్తుగడలను రూపొందించే కార్మిక వర్గ పార్టీని నిర్మించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నామని అర్థం. లెనినిజం అంటే ”సామ్రాజ్యవాద శకంలో మార్క్సిజం” అని స్టాలిన్‌ నిర్వచించాడు.
ప్రపంచ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం
ప్రపంచ కార్మిక విప్లవానికి లెనిన్‌ నాయకుడు. రష్యాలో సోషలిజం విజయవంతం కావటం, సోవియట్‌ యూనియన్‌ ఏర్పడటం ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న విప్లవ పోరాటాలు ముందుకు సాగటానికి ప్రేరకంగా ఉంటాయని ఆయనకు తెలుసు. ఈ అవగాహనతోనే ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలలోని కమ్యూనిస్టు పార్టీలు తమ తమ దేశాలలో జరుగుతున్న ప్రజాపోరాటాలను సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ స్థాయిలో జరుగుతున్న పోరాటాలతో అనుసంధానం చేశాయి. ”జాతీయ, వలస సమస్య”పై లెనిన్‌ ప్రతిపాదనలు (థీసిస్‌) అన్ని వలస దేశాలలో కొనసాగుతున్న జాతీయ విమోచన పోరాటాలను సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ స్థాయిలో జరుగుతున్న పోరాటాలతో అనుసంధానం చేయటానికి కావలసిన పునాదిని వేశాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఈ థీసిస్‌ జాతీయ, వలస వ్యతిరేక పోరాటాలపైన బలమైన ప్రభావాన్ని చూపింది. దీని ప్రభావంతో చరిత్రగతినే మార్చేంతగా విప్లవోద్యమం పురోగమించింది. ఆ కాలంలో వియత్నాంలో ఫ్రెంచ్‌ వలస పాలకులు పాల్పడుతున్న నేరాలపైన ఫ్రాన్స్‌లో నివసిస్తున్న హోచిమిన్‌ కరపత్రాలను పంచి పెడుతుండేవాడు. లెనిన్‌ తమను ఎంతగా ప్రభావితం చేశాడో ఆయన మాటల్లోనే- ”అప్పట్లో నేను అక్టోబర్‌ విప్లవ చారిత్రిక ప్రాధాన్యతను తెలుసుకోకముందే స్వభావ రీత్యా దానికి మద్దతు పలికాను. తన దేశ ప్రజలను విముక్తి చేసిన గొప్ప దేశభక్తుడైన లెనిన్‌ అంటే నాకు చాలా ఇష్టం. అప్పటివరకు నేను ఆయన రచనలను ఏవీ చదవలేదు…..ఆ తరువాత హుమనైట్‌లో ప్రచురింపబడిన లెనిన్‌ ‘థీసిస్‌ ఆన్‌ ద నేషనల్‌ అండ్‌ కలోనియల్‌ క్వశ్చన్స్‌’ను చదవమని ఒక కామ్రేడ్‌ ఇచ్చాడు. ఆ థీసిస్‌ లోని రాజకీయ పరిభాషను అర్థం చేసుకోవటం కష్టమనిపించింది. అయితే పదేపదే చదవటం వల్ల అంతిమంగా దాని ప్రధాన భాగాన్ని అర్థం చేసుకోగలిగాను. అది నాలో ఎంతో ఉద్విగతను, ఉత్సాహాన్ని, స్పష్టతను, ఆత్మస్థైర్యాన్ని నింపింది! ఆ సంతోషంలో నా కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు రాలాయి. నా గదిలో ఒక్కడినే ఏకాంతంగా కూర్చున్నప్పటికీ ఒక మహాసభలో ప్రసంగిస్తున్నట్టుగా పెద్దగా అరుస్తూ ఇలా మాట్లాడాను: ‘ప్రియమైన యోధులారా, నా దేశ వాసులారా! మనకు కావలసింది ఇదే. మన విమోచనకు ఇదే మార్గం!”
తూర్పు దేశాలకు చెందిన శ్రామికుల కోసం లెనిన్‌ ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఈ విశ్వ విద్యాలయంలో విద్యను అభ్యసించిన విప్లవకారులు సిద్ధాంతం, ఆచరణలపైన సమగ్రమైన అవగాహనతో విప్లవోద్యమాన్ని బలోపేతం చేయటానికి తమ తమ దేశాలకు తిరిగి వెళ్ళారు. ఆ విధంగా కార్మిక వర్గ ఉద్యమానికి, కమ్యూనిస్టు అంతర్జాతీయతకు అంతర్జాతీయ సంఘీభావాన్ని అందించటానికి లెనిన్‌ మార్గదర్శక పాత్రను పోషించాడు-‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి, మీకు పోయేదేమీ లేదు సంకెళ్ళు తప్ప’.
ఆత్మాశ్రయ కారకం
పెట్టుబడిదారీ వ్యవస్థ ఎన్నడూ తనంత తానుగా పతనం కాదు. దాన్ని కూలదోయవలసిందే. పెట్టుబడిదారీ పాలనపైన రాజకీయ దాడిని తీవ్రతరం చేయటానికి ప్రజా పోరాటాలు, వర్గపోరాటాలు ఉధృతం చేయాలి. సమాజంలో బలమైన భౌతిక శక్తిగా కార్మిక వర్గం ఎదిగేదాన్నిబట్టే పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోయటమనే విప్లవ కార్యాచరణ ఆధారపడి ఉంటుంది. ఇటువంటి భౌతిక శక్తిని నిర్మించటంలో ‘ఆత్మాశ్రయ కారకం’ ముఖ్య భూమిక వహిస్తుంది. ‘వస్తుగత కారకం’ అనేది సంక్షోభం తాలూకు నిర్దిష్ట పరిస్థితులకు సంబంధించినది. ఇది విప్లవకర శక్తులు ముందుకు సాగడానికి తోడ్పడుతుంది. అయితే ఈ విప్లవకర శక్తుల పురోగమనం అనేది కేవలం వస్తు కారకంతోనే సాధ్యపడదు. దీనికి ‘ఆత్మాశ్రయ కారకం’ కూడా తోడవ్వాలి. ఈ రెండింటినీ జమిలిగా సమర్థవంతంగా మేళవించడం ద్వారానే ఆ యా దేశాల్లో విప్లవ పరివర్తనను వేగవంతం చేయవచ్చు.
విప్లవ ఎత్తుగడలు
ఈ ప్రక్రియను ముందుకు తీసుకుపోవటానికి తగిన ఎత్తుగడలు అవసరం అవుతాయి. ఇప్పుడు కూడా లెనిన్‌ కార్యాచరణ, బోధనలు మార్గనిర్దేశం చేస్తాయి. లెనిన్‌ శత జయంతి సందర్భంగా మాకినేని బసవపున్నయ్య ‘పీపుల్స్‌ డెమోక్రసీ’లో ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసానికి ఆయన పెట్టిన శీర్షిక ‘రాజ్యాధికారం కోసం, దాన్ని స్థిరీకరించటం కోసం చేసే పోరాటంలో కార్మిక వర్గ ఎత్తుగడల ప్రవీణుడు’. చాలామంది చాలా తరచుగా లెనిన్‌ ఎత్తుగడల ప్రావీణ్యతను, రష్యన్‌ విప్లవం అంతిమంగా విజయం సాధించేవరకు ప్రతి మలుపులో ఆయన వేసిన ఎత్తుగడలు పోషించిన పాత్రను పట్టించుకోరు. ప్రపంచ స్థాయిలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా విప్లవోద్యమాన్ని ముందుకు నడిపేందుకు అనుసరించవలసిన ఎత్తుగడల గురించి ఆయన దిశా నిర్దేశం చేశాడు.
స్టాలిన్‌ తన ”లెనినిజం పునాదులు” గ్రంథంలో లెనిన్‌ ఎత్తుగడల నియమాలు మూడు విషయాల మీద ఆధారపడి ఉంటాయని రాశాడు. వాటిని ఆయన ఇలా సంక్షిప్తీకరించాడు (1) జాతీయ ప్రత్యేక లక్షణాలు, స్వభావాలు, (2) విప్లవ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవటానికి కార్మిక వర్గానికి మిత్ర పక్షాలను కలిపేందుకు గల అవకాశం ఎంత చిన్నదైనా వదులుకోరాదు. ఈ ప్రయత్నంలో సదరు పక్షాలు తాత్కాలికంగానే కలుస్తాయా, నిలకడ లేకుండా ఉన్నాయా, నమ్మదగినవి కావా అనే విషయాలను పట్టించుకోనవసరం లేదు, (3) ప్రజా సమూహాలకు ఆచరణాత్మకమైన రాజకీయ అనుభవం రావటానికి కావలసిన రాజకీయ శిక్షణకు ప్రచారం, ఉద్యమించటం మాత్రమే సరిపోవు.
వర్తమాన పరిస్థితి
భారతదేశంలో ప్రస్తుతమున్న పరిస్థితిలో ఈ దిశలో ముందుకు పోవాలంటే బిజెపిని ఒంటరిని చేసి ఓడించటం తక్షణ కర్తవ్యంగా ఉండాలి. భారత రాజ్యాంగాన్ని నాశనం చేయటానికి, లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్యాన్ని ఆర్‌.ఎస్‌.ఎస్‌ భావజాలానికి అనుగుణంగా ఒక తీవ్ర అసహన, ఫాసిస్టు ”హిందుత్వ రాజ్యం”గా పరివర్తించటానికి ఉపయోగిస్తున్న రాజ్యాధికారంపైన బిజెపికి నియంత్రణ లేకుండా చేయాలి. దీన్ని సాధించాలంటే లెనినిస్టు విప్లవ ఎత్తుగడల నియమాల ఆధారంగా సరైన ఎత్తుగడలను అనుసరించి తీరాలి. లెనినిజం వర్ధిల్లాలి!
— సీతారాం ఏచూరి
సిపిఎం ప్రధాన కార్యదర్శి

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *