జనగాంలో వేగవంతంగా ధాన్యం కొనుగోళ్లు
గత ఖరీఫ్‌ను మించిన రికార్డు
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జనగాం జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు.అధికారుల నిరంతర పర్యవేక్షణ,ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వల్ల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సాఫీగా,వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు.ప్రస్తుత ఖరీఫ్ 2025-26 సీజన్‌లో ఇప్పటివరకు జిల్లాలో 37,101 మంది రైతుల నుంచి 14,73,608 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేసి,ఇందుకు గాను రూ.329.74 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.ఇది గత ఖరీఫ్ సీజన్ కంటే గణనీయంగా ఎక్కువని తెలిపారు.గత ఖరీఫ్ 2024-25 సీజన్‌లో జిల్లాలో 9,10,431 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేసి,రైతుల ఖాతాల్లో రూ.211.21 కోట్లను జమ చేయడం జరిగిందన్నారు.ప్రస్తుత సీజన్‌లో కొనుగోళ్లు,చెల్లింపులు రెండింటిలోనూ స్పష్టమైన వృద్ధి నమోదైందని పేర్కొన్నారు.అలాగే ఈ ఖరీఫ్ సీజన్‌లో సన్న ధాన్యం విక్రయించిన రైతులకు బోనస్ రూపేణా ఇప్పటికే రూ.12.01 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్యాడీని వెంటనే ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించడం,కొనుగోలు వివరాలను రోజువారీగా ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వల్ల రైతులకు వేగంగా చెల్లింపులు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు.ఈ విధానాల కారణంగా రాష్ట్ర స్థాయిలో జనగాం జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు.కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ,మండల,జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపడుతూ ప్రతి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
